Naga Chaitanya-Sobhita Dhulipala: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య , హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇటీవల వీరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను శోభితా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పసుపు దంచుతున్న ఫొటోలను శోభితా తన ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నారు. ‘గోధుమరాయి పసుపు దంచడంతో పనులు ప్రారంభమయ్యాయి’ అని క్యాప్షన్ పెట్టారు. ఎరుపు రంగు, గోధుమ వర్ణం పట్టు చీరలో శోభిత మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. పెళ్లి ఎక్కడ, ఎప్పుడో చెప్పాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
ఇటీవల శోభితతో దిగిన ఫొటోను నాగచైతన్య షేర్ చేశారు. వీరిద్దరూ ట్రెండీ లుక్స్‌లో ఉన్న ఆ ఫొటో కూడా క్షణాల్లో నెటిజన్లను ఆకర్షించింది. కాగా, హీరోయిన్ సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య, శోభిత ప్రేమలో పడిపోయాడు. వీరిద్దరూ కొంతకాలం సీక్రెట్ గా డేటింగ్ చేశారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆగస్టు 8న వీరి నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వేడుకలో కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితులు పాల్గొన్నారు.
కాగా, వీరి పెళ్లి వైజాగ్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే, పెళ్లి వేదిక అధికారికంగా ప్రకటించలేదు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’సినిమాతో బిజీగా ఉన్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక, శోభితా.. టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్నారు.

