Nadendla manohar: ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహనం వద్ద మామిడికాయలు పారబోసేందుకు ముందస్తు ప్రణాళిక ప్రకారం ట్రయల్ రన్ నిర్వహించారని వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులు అరెస్టు చేసిన నిందితులు విచారణలో అంగీకరించారని ఆయన తెలిపారు.
“రైతులను పరామర్శించేందుకు జగన్ వెళ్తున్న సమయంలోనే, ఆ ప్రదేశంలో మామిడి కాయలు రోడ్డుపై వేసి తొక్కించేలా కుట్ర చేశారు. తుమ్మలపాలెం ప్రాంతానికి చెందిన న్యాయవాది దేవేంద్ర ఐదు ట్రాక్టర్ల మామిడి లోడ్లను తెప్పించి, జగన్ వాహనం వచ్చినప్పుడు రోడ్డుపై వేయాలని సూచించాడు. దీనికోసం ముందుగానే రిహార్సల్స్ కూడా చేశారు” అని మంత్రి పేర్కొన్నారు.
పోలీస్ కస్టడీలో ఉన్న ఇద్దరు ట్రాక్టర్ డ్రైవర్లు కూడా ఈ విషయాన్ని అంగీకరించారని నాదెండ్ల తెలిపారు. “జగన్ వాహనం వచ్చినప్పుడు సరుకును తీసుకువచ్చి వేయాలని చెప్పినట్టు వారు తెలిపారు” అని చెప్పారు.
డ్రోన్ ఫుటేజీ ద్వారా కూడా మామిడి తోట నుంచి ఐదు లోడ్ల మామిడిని రోడ్డుపైకి తెచ్చి పారబోసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, మామిడి కొనుగోళ్ల అంశాన్ని బలవంతంగా సమస్యగా మార్చే ప్రయత్నమేనని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
ఇలాంటి కృత్రిమ సమస్యల వెనుక దాగిన అసలైన ఉద్దేశాలను ప్రజలు గుర్తించాలని, ఇటువంటి కుట్రలకు తలోగొట్టి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
