Nadendla manohar: కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పండూరులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం చేరాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
మే నెల నుంచి పాఠశాలలు తెరవడానికి ముందుగా, మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం వినియోగానికి మారుతున్నామని మంత్రి తెలిపారు. దీనికి అవసరమైన 1 లక్ష 14 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు.
ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతాయని, మే నెలలో తల్లి వందనం పథకం కింద అర్హులైన తల్లులకు రూ.15,000 అందించనున్నట్లు తెలిపారు. 2028 నాటికి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు జల జీవన్ మిషన్ పథకం కింద కుళాయిల ద్వారా నీటి సరఫరా చేపట్టనున్నామని వివరించారు.
మహిళల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. చుక్కల భూముల సమస్యను త్వరలో ముఖ్యమంత్రి సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
గ్రామాల్లో పంచాయతీల అభివృద్ధి కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, గ్రామాల్లో తాగునీరు, ఇతర అవసరాలను గ్రామపంచాయతీల ద్వారా తీర్చేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందించే రేషన్ బియ్యం గురించి ఎటువంటి అపోహలకు గురికావద్దని, ప్లాస్టిక్ బియ్యం అంటూ జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ప్రజలను మంత్రి మనోహర్ కోరారు. పౌష్టికాహారం మెరుగుపరిచే లక్ష్యంతో ఫోర్టిఫైడ్ బియ్యం అందిస్తున్నామని, దీని కోసం ప్రభుత్వం ప్రతి కిలో బియ్యానికి రూ.46.10 ఖర్చు చేస్తోందని వివరించారు.
పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు అందిస్తున్నామని, భవిష్యత్తులో రాగులు, ఇతర మిల్లెట్స్ కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.