Karur Stampede: తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘోర దుర్ఘటన రాష్ట్రాన్ని కన్నీటి ముంపులో ముంచెత్తింది. టీవీకే పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ నిర్వహించిన భారీ సభలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అంచనాలను మించి జనసందోహం రావడంతో తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 12 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉండటం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది.
అంచనాలకు మించి జనసందోహం
కరూర్‌లో శనివారం సాయంత్రం విజయ్ సభ జరిగింది. నిర్వాహకులు సుమారు 10 వేల మంది వస్తారని భావించినప్పటికీ, 50 వేల మందికిపైగా అభిమానులు తరలివచ్చారు. ఇరుకైన ప్రాంగణం, తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, విజయ్ రాకలో ఆరు గంటల ఆలస్యం కావడంతో జనం అదుపుతప్పారు. ఒక్కసారిగా తోపులాట ప్రారంభమై, అనేక మంది ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.
இதயம் நொறுங்கிப் போய் இருக்கிறேன்; தாங்க முடியாத, வார்த்தைகளால் சொல்ல முடியாத வேதனையிலும் துயரத்திலும் உழன்று கொண்டிருக்கிறேன்.
கரூரில் உயிரிழந்த எனதருமை சகோதர சகோதரிகளின் குடும்பங்களுக்கு என் ஆழ்ந்த அனுதாபங்களையும், இரங்கலையும் தெரிவித்துக்கொள்கிறேன். மருத்துவமனையில் சிகிச்சை…
— TVK Vijay (@TVKVijayHQ) September 27, 2025
విజయ్ స్పందన
ఈ ఘటనపై విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నా గుండె ముక్కలైంది, ఈ బాధను మాటల్లో చెప్పలేను. ప్రాణాలు కోల్పోయిన నా సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ సోషల్ మీడియాలో తన భావాలను వ్యక్తం చేశారు. ఘటన అనంతరం చెన్నైకి చేరుకున్న విజయ్, ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: TVK Rally Stampede: కరూర్ ఘటనలో 40కి చేరిన మృతుల సంఖ్య.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్
రాజకీయ ప్రతిస్పందనలు
ఈ దుర్ఘటనపై డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహణలో నిర్లక్ష్యం వహించిన విజయ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, సభకు పోలీసుల నుంచి కేవలం 10 వేల మందికి మాత్రమే అనుమతి లభించిందని, కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో ఈ విషాదం తప్పలేదని అధికారులు స్పష్టం చేశారు.
ప్రభుత్వ సహాయం
మృతుల కుటుంబాలకు తాను వ్యక్తిగతంగా సానుభూతి తెలియజేస్తున్నానని, ఆసుపత్రిలో గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించమని ఆదేశించానని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఘటన స్థలానికి, ఆసుపత్రులకు తాను వెళ్లి పరిస్థితిని పరిశీలిస్తానని ఆయన అన్నారు.
రాష్ట్రం శోకసంద్రంలో
ఒకే సంఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోవడం తమిళనాడును విషాదంలో ముంచెత్తింది. కరూర్ విషాదం మరోసారి భారీ సభల భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రజల ప్రాణాలు రక్షించడం నిర్వాహకుల ప్రధాన బాధ్యత అని నిపుణులు సూచిస్తున్నారు.