Murmu: నిజాయతీ, సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి

Murmu: ప్రభుత్వ ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో నిజాయతీ, సమగ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈ రెండు లక్షణాల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల (పీఎస్‌సీ) చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
“అభ్యర్థుల్లో నైపుణ్యాలు లేదా సామర్థ్యాలు తక్కువగా ఉంటే, శిక్షణ కార్యక్రమాల ద్వారా వాటిని మెరుగుపరచవచ్చు. కానీ నిజాయతీ, సమగ్రత లోపిస్తే పరిపాలనలో అధిగమించలేని సమస్యలు ఎదురవుతాయి. అందుకే నియామక ప్రక్రియలో చిత్తశుద్ధికి పీఎస్‌సీలు పెద్దపీట వేయాలి” అని పేర్కొన్నారు.

ప్రభుత్వ సేవల్లోకి వచ్చే యువతకు అట్టడుగు, బలహీన వర్గాల సేవ పట్ల నిబద్ధత ఉండాలని రాష్ట్రపతి సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా పని చేసే దృక్పథం అభ్యర్థుల్లో ఉండాలని ఆకాంక్షించారు.

మహిళల పట్ల సున్నితత్వం అవసరం

ప్రభుత్వ పాలనలో మహిళల అవసరాలు, ఆకాంక్షల పట్ల సివిల్ సర్వెంట్లు మరింత సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి నొక్కి చెప్పారు.
“పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అభ్యర్థుల్లో జెండర్ సెన్సిటైజేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వ పథకాలు మహిళలకు సమర్థవంతంగా చేరతాయి” అని వివరించారు.

నిష్పాక్షికత, కొనసాగింపు, స్థిరత్వం వంటి లక్షణాలను ప్రభుత్వ పాలనకు అందించేది ‘శాశ్వత కార్యనిర్వాహక వర్గం’ అని పేర్కొన్న ఆమె, ఈ వర్గాన్ని ఎంపిక చేసే బాధ్యత పూర్తిగా పీఎస్‌సీలదేనని గుర్తుచేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలలో ప్రజా విధానాలు సమర్థంగా అమలు కావాలంటే అధికారుల సమగ్రత, సున్నితత్వం, సామర్థ్యం అత్యంత కీలకమని తెలిపారు.

‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో కీలక పాత్ర

మారుతున్న సాంకేతిక సవాళ్లను ముందుగానే అంచనా వేసి, నియామక ప్రక్రియలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేయాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశానికి అన్ని స్థాయిలలో సమర్థవంతమైన పరిపాలన వ్యవస్థలు అవసరమని ఆమె పేర్కొన్నారు.

“త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోంది. అలాగే 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధించడంలో పీఎస్‌సీలు ఎంపిక చేసే అధికారుల పాత్ర అత్యంత కీలకం” అని ద్రౌపది ముర్ము అన్నారు.

ఈ సదస్సులో తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, యూజీసీ చైర్మన్ వినీర్ జోషి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *