Murder case:భావి జీవితంలో తప్పులు చేయకుండా నీతి నిజాయితీతో కూడిన పాఠాల సారాంశంతో పిల్లలకు హితబోధ చేయాల్సిన ఆ ఉపాధ్యాయులు దారితప్పారు. వక్రమార్గంలో నడిచే పిల్లలకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఆ టీచర్లు నియమాల కట్టుతప్పారు. వివాహం అనే బంధానికే ఆ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు మచ్చతెచ్చారు. వివాహేతర బంధంతో చెలరేగిపోయిన ఆమె.. ప్రియుడైన మరో ఉపాధ్యాయుడితో కలిసి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో ఏకంగా భర్తనే కడతేర్చింది. ఈ లోకంలో లేకుండా చేసింది.
Murder case:నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతీనగర్ కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పద్మ (30) తన భర్త లక్ష్మణ్‌నాయక్‌తో కలిసి నివాసం ఉంటున్నది. పద్మకు 2024లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. ఆమె ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నది.
Murder case:పద్మకు తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న రాత్లావత్ గోపి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర బంధం ఏర్పడింది. ఇష్టారీతిన చెట్టాపట్టాలేసుకొని వారిద్దరూ తిరగసాగారు. వేళాపాలా లేకుండా ఇంటికి వచ్చే వారు. ఆలస్యంపై భర్త లక్ష్మణ్‌నాయక్ ఓ రోజు నిలదీయడంతో ఆమెలో రాక్షసత్వం జడలు విప్పుకున్నది. తమ వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. ఎలాగైనా కడతేర్చాలని ఆనాడే నిర్ణయించుకున్నది.
Murder case:గత నెల 24వ తేదీన రాత్రి సమయంలో లక్ష్మణ్‌నాయక్‌ను చంపాలని పద్మ, ఆమె ప్రియుడు గోపి ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రకారం.. ఆ రోజు రాత్రి లక్ష్మణ్‌నాయక్ నిద్రలో ఉండగానే ముక్కు, నోటిపై గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేశారు. ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు భర్త మృతదేహం ఇంటిలో ఉండగానే, ఏమీ ఎరుగనట్టు పద్మ ఎప్పటి మాదిరిగానే పాఠశాలకు విధులకు వెళ్లింది.
Murder case:స్కూల్‌లో ఉండగానే, వారు నివాసం ఉండే ఇంటి యజమానికి ఫోన్ చేసింది. తన భర్త ఎంత ఫోన్ చేసినా ఎత్తడం లేదని, తనకు భయంగా ఉన్నదని ఆందోళన పడుతున్నట్టు నటించింది. ఆ తర్వాత పద్మ ఇంటికి వచ్చింది. ఈలోగా తన భర్త చనిపోయి ఉన్నాడని బంధుమిత్రులను నమ్మించింది. ఈ లోగా వచ్చిన లక్ష్మణ్‌నాయక్ తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Murder case:పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో అసలు బాగోతం బయటపడింది. తాము చేసిన దురాఘతాన్ని పద్మ ఒప్పుకున్నది. గోపితో కలిసే తన భర్తను చంపినట్టు పోలీసులకు చెప్పింది. తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈ పనిచేసినట్టు అసలు వాస్తవాన్ని ఒప్పుకున్నది. పిల్లలకు నీతి సూత్రాలు బోధించాల్సిన ఆ ఉపాధ్యాయులు హంతకులుగా మారడంతో ఉపాధ్యాయ లోకంలో విస్మయం వ్యక్తమవుతున్నది. నిందితులైన పద్మ, గోపిలను అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండ్‌కు తరలించగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
