Double Decker Bus: బస్సు సర్వీసుల్లో ఎప్పుడూ నష్టాలే వస్తున్నాయని చెబుతారు. కానీ, ఇటీవల ప్రవేశపెట్టిన ఒక డబుల్ డెక్కర్ బస్సు పదిరోజుల్లో దాదాపుగా మూడు లక్షల రూపాయల ఆదాయాన్ని సాధించి రికార్డ్ సృష్టించింది. అవును.. కేరళలోని మున్నార్‌లో నడుస్తున్న ‘డబుల్ డెక్కర్’ బస్సు పది రోజుల్లో రూ. 2.99 లక్షల ఆదాయాన్ని ఆర్జించింది.
మున్నార్ సహజ సౌందర్యాన్ని ఆస్వాదించడానికి, కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ‘రాయల్ వ్యూ డబుల్ డెక్కర్’ ప్రాజెక్ట్ కింద ఫిబ్రవరి 8న ‘డబుల్-డెక్కర్’ బస్సు సర్వీస్ ప్రారంభించింది. బస్సు బయటి భాగం, పైకప్పు ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేసి ఉండడంతో.. పర్యాటకులు బస్సులో ప్రయాణించేటప్పుడు బయటి దృశ్యాలను ఆస్వాదించే అవకాశం ఉంది. దీంతో ఈ బస్సుకు ప్రారంభంలోనే అత్యధిక డిమాండ్ వచ్చింది.
ఇది కూడా చదవండి: Delhi CM Rekha Gupta: నేడు కొత్త సీఎం రేఖ గుప్తా ప్రమాణ స్వీకార.. ఈ ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా
ఈ బస్సు ప్రారంభించిన పది రోజుల్లోనే 869 మందిని తీసుకెళ్లింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.2,99,200 ఆదాయం వచ్చింది. ఈ బస్సులు పాత మున్నార్‌లోని ప్రభుత్వ బస్ డిపో నుండి ఉదయం 9:00 గంటలకు, మధ్యాహ్నం 12:30 గంటల, సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరుతాయి. ఈ బస్సు ద్వారా కేప్ రోడ్, రాక్ కేవ్, పెరియకనల్ జలపాతం,అనయిరంగల్ ఆనకట్టను సందర్శించవచ్చు.
కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారిక మొబైల్ యాప్ మరియు onlineksrtcswift.com వెబ్‌సైట్ ద్వారా బస్సు బయలుదేరే గంట ముందు స్వయంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం విదేశీ పర్యాటకులు బస్సులో ప్రయాణించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, వేసవి పర్యాటక సీజన్ ప్రారంభం కానున్నందున దేశీయ పర్యాటకులు ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తమ్మీద డబుల్ డెక్కర్ బస్సు పర్యాటక శాఖకు ఆదాయాన్నీ.. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.