Municipal Elections: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చకచకా ఏర్పాట్లు చేస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ నెల 11వ తేదీన లేదా 20వ తేదీ లోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది. ఇప్పటికే పాలకవర్గాల గడువు ముగిసిన పట్టణాల్లో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.
ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా రూపకల్పన ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. జనవరి 1వ తేదీన అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయగా, ఈ నెల 10వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు. ఓటర్ల లిస్ట్ ఖరారు కాగానే, అంటే జనవరి 11న ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనికోసం పురపాలక శాఖ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది.
ఒకవేళ సంక్రాంతి పండుగ సెలవుల వల్ల 11వ తేదీన వీలు పడకపోతే, పండుగ ముగిసిన వెంటనే అంటే జనవరి 20వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఈ నెలాఖరు కల్లా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆశావాహులు ఇప్పటికే తమ తమ వార్డుల్లో గెలుపు గుర్రాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
