Municipal Election Nominations: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రమంతా రాజకీయ వాతావరణం నెలకొంది. నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజైన గురువారం అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి అంబరాన్నంటింది. మొదటి రోజున నామినేషన్లు తక్కువగా ఉన్నప్పటికీ, రెండో రోజుకు వచ్చేసరికి అభ్యర్థులు పోటీపడి మరీ దరఖాస్తులు సమర్పించారు.
నామినేషన్ల జోరు: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని తెలిపిన వివరాల ప్రకారం.. రెండో రోజు ఒక్కరోజే 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు నామినేషన్లతో కలిపి మొత్తం సంఖ్య 9,276కు చేరుకుంది.
ఇది కూడా చదవండి: Kollu ravindra: జగన్ 11 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి తీసుకురావాలి
పార్టీల వారీగా పోటీ: ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను భారీగా బరిలోకి దింపాయి. పార్టీల వారీగా చూస్తే:
- కాంగ్రెస్: 3,379 (అత్యధికం)
- బీఆర్ఎస్: 2,506
- బీజేపీ: 1,709
- ఎంఐఎం: 166
- బిఎస్పీ: 142
- స్వతంత్ర అభ్యర్థులు: 918
మిగిలిన నామినేషన్లు సీపీఐ(ఎం), ఆప్, టీడీపీ మరియు ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి అందాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయోనని ఇప్పుడే అంచనాలు మొదలయ్యాయి.
నేడే చివరి రోజు: నామినేషన్ల దాఖలుకు నేడు (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. చివరి రోజు కావడంతో కార్యాలయాల వద్ద అభ్యర్థుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే, సాయంత్రం 5 గంటల సమయానికి కార్యాలయ ప్రాంగణంలో ఉన్న వారందరికీ నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది. దీంతో అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి కార్యాలయాల వైపు పరుగులు తీస్తున్నారు.
