Kadapa New Mayor

Kadapa New Mayor: కడప ఇన్‌ఛార్జి మేయర్‌గా ముంతాజ్‌ బేగంకు బాధ్యతలు

Kadapa New Mayor: కడప మున్సిపల్ పాలక సంస్థలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకున్న కీలక నిర్ణయంతో, ప్రస్తుత డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంకు ఇన్‌ఛార్జి మేయర్ బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా, కడప మాజీ మేయర్ సురేష్ బాబు పదవి నుంచి తొలగింపుపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా తన కుటుంబ సభ్యుల పేరుతో కాంట్రాక్టు పనులు చేపట్టారన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై అనర్హత వేటు వేసింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం విచారణ జరపగా, ఆరోపణలు నిజమని తేలడంతో మార్చిలోనే నోటీసులు జారీ చేసి, మే నెలలో అధికారికంగా ఆయనను మేయర్ పదవి నుంచి తప్పించారు.

ఇది కూడా చదవండి: Rajanna Sircilla: వాట్సప్ గ్రూప్‌లో కార్టూన్ పోస్టు.. అధికారిపై వేటు

సురేష్ బాబు, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై ఉద్దేశపూర్వక ఆరోపణలు మోపి పదవి నుంచి తొలగించారని కోర్టులో వాదించారు. విచారణ అనంతరం హైకోర్టు ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వాలని సూచించడంతో, తాత్కాలికంగా ఆయన పదవిలో కొనసాగారు. అయితే తాజాగా మరోసారి విజిలెన్స్ నివేదికలో ఆరోపణలు నిజమని తేలడంతో, రెండు రోజుల క్రితం మున్సిపల్ శాఖ ఆయనను పదవి నుంచి తొలగిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే, కొత్తగా ముంతాజ్ బేగంకు ఇన్‌ఛార్జి మేయర్ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కడపలో రానున్న రోజుల్లో ఈ పరిణామాలు రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *