Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒకే వేదికపైకి వచ్చారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన (యూబీటీ) మరియు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కలిసి పోటీ చేయనున్నట్లు ఇరువురు నేతలు అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే మాట్లాడుతూ ముంబైకి తప్పకుండా మరాఠీ మేయర్ వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ, ఏ పరిస్థితుల్లోనైనా ముంబై తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 మున్సిపల్ కార్పొరేషన్లకు జనవరి 15న పోలింగ్ జరగనుంది. అదే రోజు 32 జిల్లాల పరిషత్‌లు, 336 పంచాయతీ సమితులకు కూడా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే సోదరుల పొత్తు ఎన్నికల రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది.
ఈ కలయికను శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ చారిత్రాత్మక ప్రారంభంగా అభివర్ణించారు. బీజేపీతో పాటు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో అసంతృప్తిగా ఉన్న నేతలు, కార్యకర్తలు తమతో కలిసి రావచ్చని ఆయన ఆహ్వానించారు. 2005లో విడిపోయిన తర్వాత దాదాపు 20 ఏళ్లకు మళ్లీ రాజకీయంగా దగ్గర కావడం విశేషమని ఆయన వ్యాఖ్యానించారు
కాగా, ఈ పొత్తుపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఉద్ధవ్–రాజ్ ఠాక్రే కూటమి చారిత్రాత్మక ఓటమికి నాంది అవుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే కాంగ్రెస్, శరద్ పవార్‌లతో చేతులు కలిపిన అంశాన్ని గుర్తు చేసిన బీజేపీ, శివసేనతో కలిసి పోటీ చేస్తే రాజ్ ఠాక్రేకు రాజకీయంగా నష్టమే జరుగుతుందని విమర్శించింది.
మొత్తంగా, ముంబై మున్సిపల్ ఎన్నికలకు ముందు ఠాక్రే సోదరుల కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈ పొత్తు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, బీఎంసీపై ఎవరి పట్టు నిలబడుతుందో ఎన్నికల ఫలితాల తర్వాత స్పష్టత రానుంది.
