Mumbai ; ఆసియా కప్–2025లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ముంబైలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) కార్యకర్తలు ఈ మ్యాచ్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే నేతృత్వంలో నిరసనకారులు టీవీ సెట్లను ధ్వంసం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం, బీసీసీఐపై నినాదాలు చేశారు.
ఆనంద్ దూబే మాట్లాడుతూ, “పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం. అలాంటి దేశంతో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలి. మ్యాచ్ నిర్వహణకు అనుమతి ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వం మన సోదరీమణుల సిందూరాన్ని అవమానిస్తోంది” అని ఆరోపించారు. దీనికి గుర్తుగా మహిళా కార్యకర్తలు చేతిలో సిందూరం పట్టుకుని నిరసన తెలిపారు. “దుబాయ్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ను మేము వ్యతిరేకిస్తున్నాం. భారత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి” అని డిమాండ్ చేశారు.
“పహల్గామ్‌లో తమ ఆప్తులను కోల్పోయిన సోదరీమణులు, తల్లులు ఈ మ్యాచ్‌ను ఎలా చూడగలరు?” అని ప్రశ్నించిన దూబే, ప్రధాన మంత్రి మోదీ ఈ మ్యాచ్‌ను ఆపాలని కోరారు. బీసీసీఐ, జై షాపై వ్యంగ్యంగా విమర్శలు చేస్తూ, “మేము విరాళాలు పంపి వారి తప్పు తెలిసేలా చేస్తాం” అన్నారు.
అలాగే భారత క్రికెటర్లను కూడా ఉద్దేశించి ఆయన విజ్ఞప్తి చేశారు. “ఆటగాళ్లు ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే, మేము వారిని సమర్థిస్తాం. కానీ ఆడితే మాత్రం వారి తీరును ఖండిస్తాం” అని స్పష్టం చేశారు.
అయితే నిరసనల మధ్య, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు భారత్–పాకిస్థాన్ పోరు ప్రారంభం కానుంది.