Mumbai Terror Alert: దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోసారి ఉగ్రవాదుల హిట్ లిస్ట్‌లో ఉందనే బెదిరింపు సందేశం కలకలం రేపింది. సుమారు 14 మంది ఉగ్రవాదులు నగరంలోకి చొరబడ్డారని, 400 కిలోల ఆర్‌డీఎక్స్‌తో భారీ విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఒక మెసేజ్ అందింది. ఈ సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.
సందేశంలో ఏముంది?
గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ముంబైలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ బెదిరింపు సందేశం అందింది. ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌లోని వాట్సాప్ హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఈ మెసేజ్‌లో, ‘లష్కర్-ఎ-జిహాదీ’ అనే సంస్థ పేరును పంపిన వ్యక్తి పేర్కొన్నాడు. మొత్తం 14 మంది ఉగ్రవాదులు 34 వాహనాల్లో 400 కిలోల ఆర్‌డీఎక్స్‌ను తీసుకుని నగరంలోకి ప్రవేశించారని మెసేజ్‌లో ఉంది.
భద్రత కట్టుదిట్టం
ఈ బెదిరింపు సందేశంపై ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ప్రారంభించింది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS), ఇతర నిఘా సంస్థలకు కూడా ఈ సమాచారం చేరవేశారు. సందేశం పంపిన వ్యక్తి ఎవరు, దాని వెనుక ఉద్దేశం ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యగా, ముంబై నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనం జరిగే ప్రాంతాలు, ప్రధాన వీధుల్లో పోలీసుల పహారా పెంచారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గతంలో కూడా ముంబై ఉగ్రవాద దాడులకు గురైంది. ఈ నేపథ్యంలో, ఈ బెదిరింపు సందేశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలు కూడా భయపడాల్సిన అవసరం లేదని, భద్రతా బలగాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు తెలిపారు.