Mulugu: ఒక వ్యక్తి ప్రాణాలు బలి తీసుకోవాలంటే.. ఎంతో వ్యథకు గురికావాలి. ఎంతోకాలం వేదనను భరించి ఉండాలి. పదుగురిలో మనస్తాపం చెంది ఉండాలి. మరి కుటుంబమే బలవన్మరణం పొందాలంటే ఆ ఇంటికి ఇలాంటివి మరింతగా జరిగి ఉండాలి. ఇక్కడా అదే జరిగినట్టుంది. తమ ఆత్మహత్యకు అనుమతించండి సారూ.. అంటూ దంపతులు కలెక్టర్‌ను వేడుకున్న ఘటన సంచలనం కలిగిస్తున్నది. మరి ఆ కుటుంబానికి ఎంత బాధ కలిగి ఉండి ఉంటుందని అందరూ అయ్యోపాపం అని అంటున్నారు.
Mulugu: భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్‌రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమికి వెళ్లడానికి ఉన్న దారిని రెండున్నరేండ్లుగా ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్ఐగా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేశ్, అతని సోదరుడు, తండ్రి కలిసి మూసేశారని ఆ దంపతులు ఆరోపిస్తున్నారు. అధికారులకు చెప్పుకున్నారు, పెద్దలతో మాట్లాడారు అయినా సమస్య పరిష్కారానికి నోచలేదు.
Mulugu: తమ భూమిలోకి వెళ్లకుండా దారిని మూసేయడంతో మూడేండ్లుగా ఆ కుటుంబం వ్యవసాయమే చేయడం లేదు. కుటుంబం గడవడం కష్టమైంది. మరోవైపు అవమానం కలిగిందని మనస్తాపం చెందారు. దీంతో ఈ విషయమై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఆ ఎస్ఐ తమపైనే అక్రమ కేసులు మోపుతున్నారని ఆ దంపతులు ఆవేదన చెందుతున్నారు.
Mulugu: ఇక చేసేది లేక తమకు చావే దిక్కని భావించిన ఆ దంపతులు ఈ నిరసనకు దిగారు. ఎస్ఐ, ఆయన కుటుంబం వేధింపులు తట్టుకోలేకపోతున్నాం. మా ఆత్మహత్యకు అనుమతించండి.. అంటూ దానికి గల కారణాలను వివరిస్తూ ఫ్లెక్సీలో రూపొందించి దానిని పట్టుకొని జిల్లా కలెక్టరేట్ ఎదుట భార్యాభర్తలు ఇద్దరూ నిరసన ప్రదర్శన చేశారు. తమకు ఆత్మహత్యే దిక్కని, ఆత్మహత్యకు తమరు అనుమతించాలని వేడుకున్నారు. వారిని ఇబ్బందులకు గురిచేసిన వారి పేర్లతో సహా ఆ ఫ్లెక్సీలో పేర్కొనడం గమనార్హం.