Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం అంబానీ గారు సుప్రభాత సేవలో పాల్గొని మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, అదనపు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో రూ.100 కోట్ల అన్నప్రసాద కేంద్రానికి చేయూత
ముకేశ్ అంబానీ కేవలం దర్శనానికే కాకుండా, తిరుమలలో ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. తిరుమలలో భక్తుల కోసం అధునాతన అన్నప్రసాద కేంద్రాన్ని నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో, సుమారు రూ.100 కోట్ల కంటే ఎక్కువ అంచనా వ్యయంతో నిర్మించబోయే ఈ కేంద్రంలో అత్యాధునిక కిచెన్ మరియు ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
స్వామివారి దర్శనానికి వచ్చిన అంబానీ దృష్టికి ఈ విషయాన్ని టీటీడీ అధికారులు తీసుకెళ్లగా, ఆయన ఈ ప్రాజెక్ట్‌కు చేయూత అందించడానికి సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. ఈ కొత్త కేంద్రం అందుబాటులోకి వస్తే, ప్రతిరోజూ సుమారు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే అవకాశం ఉంటుంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో టీటీడీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా ఉందని రిలయన్స్ సంస్థ ప్రకటించింది.
గురువాయూర్‌లో ఆసుపత్రుల నిర్మాణానికి రూ.15 కోట్ల విరాళం
తిరుమల పర్యటన తర్వాత ముకేశ్ అంబానీ కేరళ రాష్ట్రంలోని త్రిశ్శూర్ జిల్లా గురువాయూర్‌లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం, దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన మల్టీస్పెషాలిటీ ఆసుపత్రితో పాటు, ఆలయ ఏనుగుల వైద్యం కోసం నిర్మించే ఆధునిక పశు వైద్యాలయానికి కూడా ఆయన భారీ విరాళం ప్రకటించారు. ఈ రెండు నిర్మాణాల కోసం ముకేశ్ అంబానీ రూ.15 కోట్ల విరాళం చెక్కును దేవస్థానం అధికారులకు అందజేశారు.

