Renuka Chowdhury: ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లు రావడం ఆ ప్రాంత రైతులు చేసిన సుదీర్ఘ పోరాటానికి దక్కిన విజయమని ఆమె కొనియాడారు. రాజధాని విషయంలో గత 12 ఏళ్లుగా నెలకొన్న సందిగ్ధత వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో నష్టపోయిందని, ముఖ్యంగా పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయి అభివృద్ధి కుంటుపడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సభలో జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని దుయ్యబట్టారు. 12 ఏళ్లు గడిచినా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తి కాకపోవడం దారుణమని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, విభజన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా హామీలను ఎందుకు పెండింగ్‌లో పెట్టారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. కాలయాపన వల్ల రాష్ట్రం నష్టపోయినందుకు కేంద్రం ప్రత్యేకంగా పరిహారం చెల్లించాలని రేణుకా చౌదరి ఈ సందర్భంగా సభలో గట్టిగా వినిపించారు.
