AP Liquor Scam

AP Liquor Scam: ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజంపేట ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డికి ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది.

71 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిథున్ రెడ్డి, కోర్టు ఆదేశాల ప్రకారం రూ.2 లక్షల ష్యూరిటీతో పాటు రెండు జామీన్లు సమర్పించాలి. అలాగే, వారానికి రెండుసార్లు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలి అనే షరతులు విధించింది. ఈ ఉత్తర్వుల మేరకు ఆయన మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

అరెస్ట్ నుంచి బెయిల్ వరకు ప్రయాణం

ఈ ఏడాది జులై 19న సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి, సాయంత్రం అరెస్ట్ చేశారు. విచారణలో సహకరించలేదని ఆరోపణలు చేస్తూ ఆయనను జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన పలు సార్లు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ కోర్టు తిరస్కరించింది. అయితే, ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి తాత్కాలికంగా నాలుగు రోజుల బెయిల్ మాత్రమే మంజూరు చేయబడింది. ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయి బెయిల్ లభించడం గమనార్హం.

ఇప్పటివరకు ఐదుగురికి బెయిల్

లిక్కర్ స్కామ్‌లో సిట్ అరెస్ట్ చేసిన వారిలో ఇప్పటి వరకు ఐదుగురికి బెయిల్ లభించింది. సెప్టెంబరు ప్రారంభంలోనే ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్ రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్పలకు బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. కాగా, ఈ కేసులో ఏ1 రాజ్‌ కేసిరెడ్డి సహా మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికీ జైలులోనే ఉన్నారు. ఆయన సహా కొందరు నిందితులు అనారోగ్య కారణాలు చూపుతూ బెయిల్ ప్రయత్నాలు చేస్తున్నా కోర్టు తిరస్కరించింది.

ఇది కూడా చదవండి: Nara Lokesh: తిలక్ వర్మ బహుమతి: “నాకెంతో ప్రత్యేకం” – మంత్రి నారా లోకేశ్

భారీ అవినీతి ఆరోపణలు

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలులోకి వచ్చిన మద్యం పాలసీ క్రమంలో రూ.3,500 కోట్ల మేర అక్రమాలు జరిగాయని సిట్ దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లోని ఓ ఫార్మ్ హౌస్‌లో భారీగా నగదు పట్టుబడటంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

పరారీలో ఉన్న నిందితులపై కఠిన చర్యలు

ఇక, పరారీలో ఉన్న నిందితులపై కూడా ఏసీబీ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. వారిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *