Arvind Dharmapuri: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కవిత నడుస్తున్నారని, ఇద్దరూ వ్యాపార భాగస్వాములు అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంపీ అరవింద్, కవిత చేపట్టిన ‘జనం బాట’ యాత్రపైనా తీవ్రంగా స్పందించారు. “కవిత మొదలుపెట్టిన ‘జనం బాట’ యాత్ర నేరుగా తీహార్ జైలుకు వెళ్తుంది. ఇంకో మూడు నాలుగు ఏళ్ల తర్వాత కవిత అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
కవిత ఎవరు? జాగృతి ఏంటి?
కవిత నేపథ్యం, ఆమె స్థాపించిన జాగృతి సంస్థపైనా ఎంపీ అరవింద్ ప్రశ్నలు సంధించారు. “అసలు కవిత ఎవరు? జాగృతి అంటే ఏంటి?” అని ప్రశ్నించారు. గతంలో కవిత వేధింపుల భయంతోనే కాంట్రాక్టర్లు పారిపోయారని ఆరోపించారు.
‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ ఆపింది మీరే!
కల్వకుంట్ల కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఎంపీ అరవింద్ మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆపింది ఎవరని ఆయన నిలదీశారు. అణగారిన వర్గాల విద్యార్థులు చదువుకుని, పైకి రాకూడదనే కుటిల ఆలోచన ఆ కుటుంబానిదేనని మండిపడ్డారు.
Also Read: Telangana: BRSలో విషాదం హరీశ్‌రావు తండ్రి కన్నుమూత.. జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమాలు రద్దు
ఎంపీ అరవింద్ మాటల్లోనే: “అణగారిన ప్రజలు బాగుపడితే జీర్ణించుకోలేని దురదృష్టవంతులు మీరు. ఒక తరం మొత్తాన్ని అణగదొక్కింది కల్వకుంట్ల కుటుంబమే.”
కవిత-రేవంత్ రెడ్డి ‘ములాఖత్’ రహస్యం ఏంటి?
ఎమ్మెల్సీ కవిత రాజీనామా అంశాన్ని ఎంపీ అరవింద్ లేవనెత్తారు. కవిత రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరుతూ బీజేపీ తరపున మండలి ఛైర్మన్‌కు లేఖ పంపిస్తున్నట్లు తెలిపారు.
“రేవంత్ రెడ్డికి, కవితకు మధ్య ఉన్న ములాఖత్ (భేటీ) ఏంటి? కవిత రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదు?” అని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక, రేవంత్ రెడ్డి.. కవితతో కొత్త పార్టీ పెట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, “ఇద్దరూ ఒక్కటే… ఇద్దరూ బిజినెస్ పార్ట్‌నర్లే” అని ఆరోపించారు.
“ప్రజలు పిచ్చోళ్లు కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు” అని ఎంపీ అరవింద్ చివరిగా తెలిపారు.
కవిత ‘జనం బాట’ యాత్ర షురూ!
మరోవైపు, ఎంపీ అరవింద్ విమర్శల మధ్యే, ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం కీలక అడుగు వేశారు. ఆమె ‘జనం బాట’ పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నెలల సుదీర్ఘ యాత్రను నిజామాబాద్ నుంచే ప్రారంభించారు.
ఈ యాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో కాకుండా, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో ప్రజల్లోకి వెళ్లాలని కవిత నిర్ణయించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాత్ర వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది.

