Arvind Dharmapuri: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పార్టీలో ఉంటూనే నష్టం చేస్తున్న ‘కోవర్టుల’ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న వారు ఇకనైనా బయటకు వెళ్లిపోవాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఉపేక్షించకూడదని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
తెలంగాణలో బీజేపీ ఎదుగుదలపై మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో పార్టీ ఇప్పటికే చాలా బలంగా ఉందని, అయితే ఇప్పుడు దక్షిణ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అర్వింద్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరించాలంటే అన్ని ప్రాంతాల్లో కేడర్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
ఇక బీఆర్ఎస్ నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆమె మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. గత ఎన్నికల్లో ఎవరి వల్ల ఎవరు రాజకీయంగా దెబ్బతిన్నారో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లాలో తనను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకున్నాయని, కేసుల నుంచి తప్పించుకోవడానికే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
చివరగా కాంగ్రెస్ పార్టీ తీరుపై కూడా అర్వింద్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ నేతలు ఎప్పటికీ కలిసి ఉండలేరని, వారి మధ్య ఉన్న అంతర్గత విబేధాలే ఆ పార్టీని ముంచుతాయని విమర్శించారు. అభివృద్ధి కంటే రాజకీయ కుట్రలకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.
