Mounika Murder Case: విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన మౌనిక హత్య సంచలనంగా మారింది. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. డేటింగ్ యాప్‌లో పరిచయం చివరికి ప్రాణం తీసేవరకు చేరుకుంది. 2021లో డేటింగ్ యాప్‌లో మౌనికకి నేవీలో పనిచేస్తున్న రవీంద్ర పరిచయం అయ్యారు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2023లో ఇద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల మౌనిక రవీంద్రకి బ్రేకప్ చెప్పింది. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది.
బ్రేకప్ అయిన కొన్ని నెలలకే రవీంద్ర ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది కదా అనుకునేలోపే రవీంద్ర జీవితంలోకి మౌనిక వచ్చింది. అంటే ఇద్దరిలో ఒకరు మళ్ళీ పాత రిలేషన్షిప్ కొనసాగించడానికి ఒప్పించారు. దీనితో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఇదే సమయంలో రవీంద్ర భార్య గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఆమెను పుట్టింటికి పంపించాడు. అతనికి కూతురు పుట్టింది. ఇదే సమయంలో మౌనిక రవీంద్రను పెళ్లి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురిచేసేది. అలాగే అతని నేవీ ఐడీ కార్డు కూడా ఆమె తీసుకుంది.
దీనితో ఎక్కడలేని టెన్షన్, భయం రవీంద్రకి పట్టుకున్నాయి. ఐడీ కార్డు బయటికి వచ్చినా, ఈ విషయాలన్నీ భార్యకి, ఇంట్లో వాళ్లకి తెలిసినా ఎక్కడలేని సమస్యలు వస్తాయని.. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ ఒక్కటే సొల్యూషన్ మౌనికను హత్య చేయడమే అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం కత్తులు, క్లీనింగ్ సామాగ్రి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాడు. గాజువాక ఎల్వీనగర్లోని కీర్తి ఎన్‌క్లేవ్‌లో ఉంటుంది తన ఫ్లాట్ 102కి మౌనికను రప్పించుకున్నాడు. ప్లాన్ ప్రకారం గొడవ పెట్టుకోవడానికి ఐడీ కార్డు ఇవ్వాలంటూ అడిగాడు. పెళ్లి చేసుకుంటే ఇస్తా అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమె వెంటనే గట్టిగట్టిగా అరవడం మొదలు పెట్టింది. రవీంద్ర అరుపులు ఆపడానికి ఆమె ముక్కు, నోరు మూసేశాడు. ఊపిరి ఆడకపోవడంతో మౌనిక మరణించింది.
ఎలాగైనా బాడీని మాయం చేయాలని ఆర్డర్ పెట్టిన కత్తులతో ఆమె శరీరాన్ని మూడు భాగాలుగా నరికేశాడు. మొండెంని బస్తాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టాడు, కాళ్ళను సూట్‌కేసులో ఉంచి, తల, చేతులను ఇంకో సంచిలో ఉంచి ఎవరికీ దొరకకుండా వేరువేరు ప్రాంతాల్లో పారేయాలనుకున్నాడు. రక్తపు మరకలను మొత్తం క్లీన్ చేశాడు. అనంతరం అడివివరం రోడ్డులో ఎవరూ లేని ప్లేస్‌లో తల, చేతులపైన పెట్రోల్ పోసి కాల్చేసి ఇంటికి వెళ్లి మిగిలిన రెండు భాగాలను కూడా అలాగే చేయాలనుకున్నాడు. కానీ అవి చిన్న భాగాలు కాబట్టి సులభంగా తీసుకుని వెళ్ళాడు, ఇవి పెద్ద భాగాలు కావడంతో ఏంచేయాలో తోచక తన స్నేహితుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడంతో.. వెంటనే వెళ్లి పోలీసులకు లొంగిపోవాలని చెప్పాడు. అతను రవీంద్ర కుటుంబానికి ఇంకా అతని భార్యకి జరిగిన విషయం చెప్పడంతో వాళ్ళు పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి రవీంద్రను అరెస్ట్ చేశారు. ఈరోజు మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం చేశారు.
పోలీసులు రవీంద్రను సోమవారం రాత్రి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి ఏప్రిల్ 10వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించారు. తర్వాత రవీంద్రను విశాఖ సెంట్రల్ జైలుకు పంపించారు.
