Mouni Roy: హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో ప్రముఖ బాలీవుడ్ నటి మౌనీ రాయ్‌కు అత్యంత చేదు అనుభవం ఎదురైంది. వేడుకకు అతిథులుగా వచ్చిన కొందరు వ్యక్తులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కనీసం వయసును కూడా లెక్క చేయకుండా వేధించారని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఫోటోలు దిగే నెపంతో కొందరు పురుషులు తన నడుముపై చేతులు వేయడమే కాకుండా, అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా మరింత దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాతల వయసున్న వారు కూడా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మౌనీ రాయ్ పేర్కొన్నారు.
తాను వేదికపై ప్రదర్శన ఇస్తున్న సమయంలో కూడా ఈ వేధింపులు కొనసాగినట్లు మౌనీ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు స్టేజ్ కింద నిలబడి అసభ్యకరమైన సైగలు చేస్తూ, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, మొబైల్ ఫోన్లతో ‘లో-యాంగిల్’లో వీడియోలు తీస్తూ తనను తీవ్రంగా అవమానించారని ఆమె వెల్లడించారు. ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్న ఆర్గనైజర్లు కానీ, వేధింపులకు పాల్పడిన వారి కుటుంబ సభ్యులు కానీ వారిని ఆపడానికి ఏమాత్రం ప్రయత్నించకపోవడం అత్యంత విచారకరమని ఆమె దుయ్యబట్టారు. ఈ వేధింపుల కారణంగానే తన ప్రదర్శనను అనుకున్న సమయం కంటే ముందే ముగించి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.
Also Read: Puri Jagannadh: పెంగ్విన్ వైరల్ కథ.. పూరీ జగన్నాథ్ విషాద బ్యాక్ స్టోరీ!
మహిళల భద్రత, కళాకారుల గౌరవం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, మౌనీ రాయ్ తన పోస్ట్‌లో కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తారు. తనలాంటి సీనియర్ నటికే బహిరంగ వేడుకల్లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే, ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలోకి వస్తున్న యువతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయంగా ఉందని ఆమె నిలదీశారు. కళాకారులు ఎవరైనా తమ కష్టంతో గౌరవంగా బతుకుతారని, ఇతరుల వేడుకల్లో సంతోషాన్ని నింపడానికి వచ్చిన తమను కేవలం ఒక వస్తువులా చూడటం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
