USA Road Accident: విధి వక్రీకరించింది. అమెరికాలోని షికాగోలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు కన్నుమూశారు. ఈ హృదయ విదారక ఘటనతో మంచిర్యాల పట్టణంలోని వారి స్వస్థలం రెడ్డి కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మంచిర్యాల రెడ్డికాలనీకి చెందిన విశ్రాంత సింగరేణి కార్మికులు పాత విఘ్నేష్, రమాదేవి (55) దంపతులకు స్రవంతి, తేజస్వి అనే ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిగి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో స్థిరపడ్డారు. చిన్న కుమార్తె తేజస్వి (30-32) ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసుకున్నారు. ఈ శుభకార్యానికి హాజరయ్యేందుకు విఘ్నేష్ దంపతులు గత నెల (సెప్టెంబరు 18/15) అమెరికాకు వెళ్లారు. గృహ ప్రవేశ వేడుకను ఆనందంగా జరుపుకున్నారు.
Also Read: Vishaka Summit 2025: ఆఫ్టర్ గూగుల్… పెద్దగానే ప్లాన్ చేస్తున్న బాబు, లోకేష్
విషాదం చోటుచేసుకున్న రోజున, పెద్ద కుమార్తె స్రవంతి కుమారుడు నిశాంత్ జన్మదిన వేడుక ఉంది. ఈ కార్యక్రమం కోసం విఘ్నేష్, రమాదేవి, తేజస్వి, తేజస్వి భర్త కిరణ్ కుమార్తో పాటు పిల్లలు కలిసి శుక్రవారం రాత్రి 9-10 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు) కారులో మరో ప్రాంతానికి బయలుదేరారు. షికాగో సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును ఒక భారీ టిప్పర్ (ట్రక్కు) బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తల్లి రమాదేవి (55), కుమార్తె తేజస్వి (30-32) అక్కడికక్కడే మృతి చెందారు.
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందగా, కారులో ఉన్న విఘ్నేష్ (తండ్రి), అల్లుడు కిరణ్ కుమార్ (తేజస్వి భర్త)తో పాటు పిల్లలకు కూడా గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానిక అధికారులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంచిర్యాలలో ఉంటున్న బంధువులకు ఈ విషాద సమాచారం అందింది. సంతోషంగా మొదలైన ప్రయాణం విషాదంతో ముగియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను ఇండియాకు తరలించడానికి అవసరమైన ఏర్పాట్లను అమెరికాలోని బంధువులు, భారతీయ సంఘాల సహకారంతో చేస్తున్నట్లు తెలుస్తోంది.