RCB: ప్రస్తుతం ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అమ్మకానికి రానుందనే ఊహాగానాలు, క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా, అదానీ గ్రూప్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కో-ఓనర్ తో సహా పలు దిగ్గజ సంస్థలు, ఈ ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి తీవ్ర ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (Diageo అనుబంధ సంస్థ) యాజమాన్యంలో ఉన్న RCBలో మెజారిటీ వాటాలను విక్రయించడానికి యాజమాన్యం ఆసక్తిగా ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. RCB ప్రస్తుత మెజారిటీ యజమాని అయిన డియాజియో (Diageo) ప్రధానంగా లిక్కర్ వ్యాపారంపై దృష్టి సారించింది. అధిక నిర్వహణ ఖర్చులు, ఇతర కారణాల వల్ల ఐపీఎల్ ఫ్రాంచైజీని కొనసాగించడానికి వారు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
Also Read: Ravindra Jadeja: నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంటూ జడేజా ఎమోషనల్ పోస్ట్
18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత RCB 2025లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఫ్రాంచైజీ బ్రాండ్ విలువ అనూహ్యంగా పెరిగింది. ఈ సమయంలో విక్రయించడం ద్వారా గరిష్ట లాభాలను పొందాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, RCB ఫ్రాంచైజీ విలువ $2 బిలియన్లు (సుమారు ₹17,500 కోట్లు) వరకు అంచనా వేయబడింది. ఇంతటి భారీ ధరను పెట్టుబడిదారులు వెచ్చించాల్సి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో 50% వాటా కలిగిన పార్థ్ జిందాల్ (JSW గ్రూప్) RCBని కొనుగోలు చేయాలనుకుంటే, బీసీసీఐ క్రాస్-ఓనర్షిప్ నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ ఒకే సమయంలో ఐపీఎల్లో ఒకటి కంటే ఎక్కువ జట్లలో వాటాను కలిగి ఉండకూడదు. అందువల్ల, జిందాల్ ఈ రేసులో ఉండాలంటే, తప్పనిసరిగా ఢిల్లీ క్యాపిటల్స్‌లోని తమ వాటాను ముందుగా విక్రయించాలి.