Money laundering case: ఆన్లైన్ బెట్టింగ్ దందాపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఎవ్వరూ ఊహించని విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. పొట్టకూటి కోసం రోజూ బైక్ ట్యాక్సీ నడిపే ఒక డ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.331 కోట్లు జమ అయినట్లు విచారణలో బయటపడింది. 1XBet అనే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేస్తుండగా ఈ భారీ మనీలాండరింగ్ ముఠా ఉపయోగించిన ‘మ్యూల్ ఖాతా’ ఇదేనని అధికారులు గుర్తించారు.
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, 2024 ఆగస్టు 19 నుంచి 2025 ఏప్రిల్ 16 వరకు ఎనిమిదికిపైగా నెలల్లో ఈ ర్యాపిడో బైక్ డ్రైవర్ ఖాతాలో కోట్ల రూపాయలు వచ్చాయి. బ్యాంకు రికార్డులు చూసిన అధికారులు ముందుగా ఖాతాదారుని చిరునామా ధిల్లీలోని మురికివాడకు వెళ్లి చూసి ఆశ్చర్యపోయారు. రెండు గదుల చిన్న ఇంట్లో నివసించే ఈ వ్యక్తి బైక్ ట్యాక్సీ నడుపుతుంటాడు. అలాంటి మనిషి ఖాతాలో ఇంత పెద్ద మొత్తం రావడం అధికారులు నమ్మలేకపోయారు.
తర్వాత దర్యాప్తు మరింత షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఆ ఖాతా నుంచి ఉదయ్‌పూర్‌లో జరిగిన లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రూ.1 కోటి ముందస్తు చెల్లింపు జరిగినట్లు తేలింది. ఈ పెళ్లి గుజరాత్‌కు చెందిన యువ రాజకీయ నేత వివాహమని అధికారులు కనుగొన్నారు. ఈడీ అతడినీ త్వరలో విచారణకు పిలవనుంది.
ఇదే సమయంలో ఉదయ్‌పూర్ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పెళ్లిలకు కేంద్రబిందువై ఉంది. మూడు రోజుల పాటు జరిగిన నేత్ర మంతెన–వంశీ గాదిరాజుల వివాహ వేడుక దేశవ్యాప్తంగా సెంసేషన్గా మారింది. బాలీవుడ్, హాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరైన ఆ వేడుకకు సంబంధించిన వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వెనుక ఉన్న వ్యక్తి మంతెన రామరాజు—ఫార్మా ఇండస్ట్రీలో పెద్ద పేరు. అమెరికా, స్విట్జర్లాండ్, భారత్‌లలో ఆయనకు అనేక పరిశ్రమలు ఉన్నాయి.
Also Read: Smriti Mandhana: రూమర్స్ కు చెక్.. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
దర్యాప్తులో అధికారులు గుర్తించిన అత్యంత కీలక విషయం ఏమిటంటే—అక్రమ బెట్టింగ్ కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులను దాచేందుకు నెట్వర్క్ ఈ బైక్ డ్రైవర్ బ్యాంకు ఖాతాను ‘మ్యూల్ అకౌంట్’గా వాడుకుంది. నకిలీ లేదా ప్రాక్సీ కేవైసీతో భారీ మొత్తాలు ఖాతాలో డిపాజిట్ చేసి, వెంటనే ఇతర అనుమానాస్పద ఖాతాలకు నగదు తరలించినట్లు మనీ ట్రైల్లో బయటపడింది.
డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న తరువాత విచారణలో అతను ఈ లావాదేవీల గురించి ఏమీ తెలియదని, వధూవరులతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో, ఖాతాను మూడో వ్యక్తులు పూర్తిగా దుర్వినియోగం చేశారని అధికారులు భావిస్తున్నారు.
ఈ కేసును ఈడీ దేశవ్యాప్తంగా మనీలాండరింగ్ పెరుగుతున్న స్థితిని సూచించే ఉదాహరణగా పేర్కొంది. ఇదే కేసులో 1XBetకు సంబంధించి పలువురు ప్రముఖుల ఆస్తులను అటాచ్ చేస్తూ, క్రికెటర్లు శిఖర్ ధవన్, సురేష్ రైనా వంటి వారిని కూడా ప్రశ్నిస్తోంది.
అమాయకులైన సాధారణ ప్రజలకు ఈడీ ముఖ్య హెచ్చరిక కూడా జారీ చేసింది. ‘‘అజ్ఞాత వ్యక్తులు డబ్బు ఇస్తామని, రివార్డ్ ఉంటుందని చెప్పి బ్యాంక్ వివరాలు తీసుకొని మీ ఖాతాలను అక్రమ పనులకు వాడుకుంటున్నారు. ఎవరి నేరంలో పాల్గొనకపోయినా, మీ ఖాతా ద్వారా మనీలాండరింగ్ జరిగితే చట్టపరమైన శిక్షలు తప్పవు’’ అని అధికారులు స్పష్టం చేశారు.
అక్రమ బెట్టింగ్ దందాలో భాగంగా జరిగిన ఈ మొత్తం వ్యవహారం, దేశవ్యాప్తంగా మనీలాండరింగ్ ఎలా సాగుతోందో చూపిస్తూ, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.

