Mohammed Siraj: భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు ఐసీసీ జరిమానా విధించింది. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు నాలుగో రోజున జరిగిన సంఘటనకు గాను ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు సిరాజ్ కు ఈ జరిమానా విధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెన్ డకెట్‌ను సిరాజ్ ఔట్ చేసిన తర్వాత, అతనిని చూస్తూ కోపంగాగా సంజ్ఞలు చేస్తూ, దగ్గరగా వెళ్లి భుజం తగిలిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ ప్రవర్తన బ్యాట్స్‌మెన్‌ను అవమానించేలా లేదా రెచ్చగొట్టేలా ఉందని ఐసీసీ భావించింది.
ఇది కూడా చదవండి: BCCI: బీసీసీఐకి ఆదాయం ఎలా వస్తుంది?
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 (లెవల్ 1 ఉల్లంఘన) ప్రకారం, అంతర్జాతీయ మ్యాచ్‌లో అవుటైన బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టేలా లేదా అవమానించేలా భాష, చర్యలు లేదా సంజ్ఞలు ఉపయోగించడం నిషేధం. సిరాజ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించబడింది. దీనితో పాటు, అతని క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా చేర్చబడింది. గత 24 నెలల్లో సిరాజ్‌కు ఇది రెండవ డీమెరిట్ పాయింట్. గతంలో, 2024 డిసెంబరు 7న అడిలైడ్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్‌తో వాగ్వాదానికి దిగినందుకు అతనికి ఒక డీమెరిట్ పాయింట్ లభించింది. ఒక ఆటగాడు 24 నెలల కాలంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లను సేకరిస్తే, అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారి ఆటగాడిపై నిషేధం విధించే అవకాశం ఉంది.

