Mohammed Shami: భారత క్రికెట్ జట్టు సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ, తన ఫిట్‌నెస్ గురించి సెలెక్టర్లు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు జట్టులో చోటు దక్కకపోవడం, దీనిపై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారి తీశాయి.
బుధవారం నుంచి ఉత్తరాఖండ్‌తో జరగనున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరఫున షమీ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సెలక్టర్లపై ఘాటుగా స్పందించారు. “జట్టులో ఎంపిక కావడం నా చేతుల్లో లేదనేది వాస్తవం. అయితే, నేను ఫిట్‌గా లేకపోతే ఇప్పుడు రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యేవాడిని కాదు” అని షమీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Telangana Bandh: ఆ పార్టీలకు బీసీల ఓట్లడిగే హక్కు లేదు: తెలంగాణ బీసీ జేఏసీ
“నేను నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు, 50 ఓవర్ల వన్డే మ్యాచ్ ఎందుకు ఆడలేను? ఇది కచ్చితంగా వివాదాస్పదం చేయదల్చుకోలేదు. కానీ, నా ఫిట్‌నెస్ గురించి సమాచారం ఇవ్వడం లేదా అడగడం అనేది నా పని కాదు. జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కి వెళ్లి సన్నద్ధం కావడమే నేను చేయగలిగేది” అని ఆయన పేర్కొన్నారు.
షమీ మరింతగా మాట్లాడుతూ, “నా ఫిట్‌నెస్‌పై సమాచారం ఎవరి నుంచి వచ్చింది, ఎవరి నుంచి రాలేదు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత సెలెక్టర్లదే. శస్త్రచికిత్స తర్వాత, బోర్డు నిబంధనల ప్రకారం నేను పూర్తి ప్రక్రియను అనుసరించాను. ప్రస్తుతం నేను పూర్తిగా మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాను” అని కుండబద్దలు కొట్టారు.
చివరిసారిగా 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో షమీ వన్డే మ్యాచ్ ఆడారు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో ఆయన ఒకరు. ఫిట్‌గా ఉన్నప్పటికీ కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు షమీని పక్కన పెట్టడంపై క్రీడా వర్గాల్లో చర్చ మొదలైంది. రంజీ ట్రోఫీలో తన ప్రదర్శనతో తిరిగి జాతీయ జట్టులోకి రావాలనే పట్టుదలతో షమీ ఉన్నారు.