Narendra Modi: భారతదేశానికి చెందిన నదులపై పూర్తి హక్కు మనకే ఉండాల్సిన సమయంలో, పాకిస్తాన్‌కు వాటిపై పెత్తనం ఇచ్చిన గత నేతల తీర్మానాలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. తాజాగా పార్లమెంట్ వేదికగా మాట్లాడిన ఆయన, సింధూ జలాల ఒప్పందం భారతదేశానికి చేసిన ఒక పెద్ద అన్యాయం అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ ఏమన్నారు?
“నది మనది, నీళ్లు మనవి. కానీ ఆ నీళ్లపై అధికారాన్ని మాత్రం పాకిస్తాన్‌కు అప్పగించారు. ఇది ఎలా న్యాయసంగతమవుతుంది?” అని ప్రశ్నించారు మోదీ.
“సింధూ జలాల ఒప్పందం కారణంగా భారతదేశం 80% నీళ్లను పాకిస్తాన్‌కు అప్పగించింది. ఇది తెలివైన నిర్ణయం కాదు. ఇది అంతర్జాతీయంగా మన హక్కులను తాకట్టు పెట్టినట్లే” అని అన్నారు.
అంతేగాక, పాకిస్తాన్‌కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ (MFN) హోదా రద్దు చేశామన్న మోదీ, అట్టారి సరిహద్దును కూడా మూసివేశామని స్పష్టం చేశారు. “ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం మేము బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. గతంలో తీసుకున్న పొరపాట్లను సరిదిద్దుతున్నాం” అని తెలిపారు.
ఒప్పందం వెనుక నెహ్రూ పాత్రపై విమర్శలు
ఈ సింధూ ఒప్పందం అంశాన్ని వరల్డ్ బ్యాంక్‌కు అప్పగించిన వ్యక్తిగా అప్పటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ను ప్రధాని మోదీ తప్పుపట్టారు.
“మన నదులపై వచ్చిన వివాద పరిష్కార బాధ్యతను వరల్డ్ బ్యాంక్ కు అప్పగించడం భారత స్వాభిమానాన్ని చిన్నబర్చింది,” అని మోదీ వ్యాఖ్యానించారు.
ఒప్పందం లేకపోతే భారీ ప్రాజెక్టులు వచ్చేవి
ప్రధాని మోదీ అభిప్రాయానికి ప్రకారం, సింధూ ఒప్పందం లేని పక్షంలో, మన దేశంలో ఎన్నో భారీ జల ప్రాజెక్టులు ఏర్పడేవి. తాగునీళ్ల సమస్యలు ఉండేవి కాదని, వ్యవసాయానికి మరింతగా నీరు అందుతుందని ఆయన అన్నారు.
అంతేకాదు.. “పాకిస్తాన్‌కు నీళ్లు ఇచ్చినంతే కాదు… నీటిని మళ్లించేందుకు అవసరమైన కాలువల నిర్మాణానికి నిధులు కూడా నెహ్రూనే ఇచ్చారు,” అని మోదీ తీవ్ర విమర్శలు చేశారు.