Putin India Visit: భారత దేశంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునే లక్ష్యంతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో దిగిన పుతిన్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వెళ్లి ఘన స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌కు భిన్నంగా మోదీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి పుతిన్‌ను ఆహ్వానించడం, వారి మధ్య ఉన్న ఆత్మీయతను మరోసారి చాటింది. మోదీ తన 11 ఏళ్ల పాలనలో ఈ విధంగా ఆహ్వానించిన ఏడో విదేశీ అతిథి పుతిన్ కావడం విశేషం.
విమానం నుంచి దిగి వచ్చిన పుతిన్‌కు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం లభించింది. అనంతరం మోదీ, పుతిన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా విదేశీ పర్యటనల్లో పుతిన్ సొంత కారునే వాడినా, మోదీ మాత్రం ఆయనను తన టొయోటా ఫార్చ్యూనర్ కారులో ఎక్కించుకుని అధికారిక నివాసానికి తీసుకెళ్లారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ‘కార్‌పూలింగ్ 2.0’ అంటూ పలువురు కామెంట్లు చేశారు. ప్రధాని మోదీ తన నివాసంలో పుతిన్‌కు ప్రైవేటు విందు కూడా ఇచ్చారు.
భారత్‌లో మొత్తం 27 గంటలపాటు ఉండనున్న పుతిన్, శుక్రవారం రోజున అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత, రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు. ఉదయం 11:50 గంటలకు హైదరాబాద్ హౌస్‌లో 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం మొదలవుతుంది. ఈ రెండు గంటల సమావేశంలో రక్షణ, వాణిజ్యం, ఇంధనం, సాంకేతికతతో సహా పలు అంశాలపై చర్చలు జరపనున్నారు.
ఈ పర్యటనలో దాదాపు 25 కీలక ఒప్పందాలపై (10 ప్రభుత్వ, 15 వాణిజ్య ఒప్పందాలు) సంతకాలు జరిగే అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 1:50 గంటలకు మోదీ, పుతిన్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. అనంతరం రష్యా ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన భారత ఛానెల్‌ను పుతిన్ ప్రారంభిస్తారు. సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పాల్గొని, రాత్రి 9 గంటలకు మాస్కోకు తిరుగుపయనం అవుతారు.
Also Read: Nadendla Manohar: ‘మద్దతు ధరపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు’ – మంత్రి నాదెండ్ల కౌంటర్!
రక్షణ, వాణిజ్య సహకారంపై ప్రత్యేక దృష్టి
ముఖ్యంగా రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరుగుతాయి. అదనంగా ఎస్-400 రక్షణ వ్యవస్థలను, అలాగే ఎస్-57 వంటి ఐదో తరం యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంపై చర్చలు జరగనున్నాయి. రవాణా మద్దతు ఒప్పందానికి కూడా ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది, ఇది రక్షణ సహకారానికి మరింత బలం ఇస్తుంది.
వాణిజ్య లోటు తగ్గించడం భారత్‌కు అత్యంత కీలకమైన అంశం. రష్యా నుంచి ముడి చమురు, ఎరువుల దిగుమతుల కారణంగా ఏర్పడిన భారీ వాణిజ్య లోటు ($65 బిలియన్ దిగుమతులు vs $5 బిలియన్ ఎగుమతులు) గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్లకు చేర్చడమే లక్ష్యంగా చర్చలు సాగుతాయి. ఈ లోటును పూడ్చేందుకు భారత్ నుంచి ఫార్మా, వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు వంటి వాటి ఎగుమతులను పెంచే ఒప్పందాలు కుదరనున్నాయి.
అలాగే, రష్యాలో నిపుణుల కొరతను దృష్టిలో ఉంచుకుని, భారతీయ కార్మికులకు, నిపుణులకు రష్యాలో ఉద్యోగావకాశాలు, వారి హక్కులకు రక్షణ కల్పించే మొబిలిటీ ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. యూరేసియన్ ఆర్థిక కూటమితో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రతిపాదనపైనా ఇద్దరు నేతలు చర్చించనున్నారు.
దిల్లీలో బహుళస్థాయి భద్రత
పుతిన్ పర్యటన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీని అభేద్యమైన భద్రతతో ఉంచారు. 5,000 మందికి పైగా సిబ్బందిని భద్రతా విధుల్లో నియమించారు. ఉగ్రవాద వ్యతిరేక దళాలు, స్వాట్ బృందాలు, స్నైపర్లు వంటి అత్యున్నత భద్రతా దళాలు కీలక ప్రాంతాల్లో మోహరించాయి. దిల్లీ పోలీసు విభాగం, కేంద్ర భద్రతా సంస్థలు, రష్యా అధ్యక్ష భద్రతా బృందం కలిసి బహుళస్థాయి పర్యవేక్షణలో ఈ భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. పుతిన్ పర్యటన కోసం ఢిల్లీలోని లుట్యెన్స్ ప్రాంతాన్ని విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఈ పర్యటన కేవలం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకుని స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్న భారత్ వైఖరిని కూడా స్పష్టం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

