Sonia Gandhi: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత పదేళ్లుగా ఈ పథకాన్ని నీరుగార్చేందుకు మోదీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉందని ఆమె ఆరోపించారు. ఇటీవల ఈ పథకంలో చేసిన మార్పులు కోట్లాది మంది పేద రైతులు, కూలీలు, మరియు భూమి లేని కార్మికుల పొట్ట కొట్టేలా ఉన్నాయని ఆమె మండిపడ్డారు.
సుమారు 20 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో ఈ పథకాన్ని తీసుకువచ్చిందని సోనియా గాంధీ గుర్తు చేశారు. అప్పట్లో పార్లమెంటులో అందరి ఆమోదంతో దీన్ని ఒక చట్టంగా మార్చారని, ఇది గ్రామాల్లోని నిరుపేదల జీవితాల్లో పెద్ద మార్పును తెచ్చిందని ఆమె పేర్కొన్నారు. పల్లెల్లో ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్లడాన్ని ఈ పథకం అడ్డుకుందని, మహాత్మా గాంధీ కన్న ‘గ్రామ స్వరాజ్యం’ కలని ఇది నిజం చేసిందని ఆమె వివరించారు.
గత 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సోనియా గాంధీ విమర్శించారు. కనీసం విపక్షాలను గానీ, నిపుణులను గానీ సంప్రదించకుండా ఏకపక్షంగా పథకం పేరును, దాని రూపురేఖలను మార్చేయడం దారుణమని ఆమె అన్నారు. పేదల హక్కులను కాలరాసే ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని, దీనిపై పోరాటానికి కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.

