MLC Kavitha: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి సంబంధించిన సరిహద్దు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తాజాగా ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగడం వల్ల భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆమె తన లేఖలో స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సమయంలో జరిగిన పరిణామాలపై కవిత తన లేఖలో ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత, పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల పేరుతో ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను “చీకటి ఆర్డినెన్స్” ద్వారా ఏపీలో కలిపేశారని ఆమె ఆరోపించారు. ఈ విలీనం వల్ల తెలంగాణ లోయర్ సీలేరు పవర్ ప్లాంట్‌ను కోల్పోయిందని, అది రాష్ట్రంలో విద్యుత్ కొరతకు దారితీసిందని కవిత వివరించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ఆలయానికి ముంపు ప్రమాదం ఉందని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
విలీనం చేయబడిన ఈ ఏడు మండలాల్లోని యటపాక, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం అనే ఐదు గ్రామాలు భద్రాచలం పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి వంటి కనీస అవసరాల కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడిందని కవిత తన లేఖలో పేర్కొన్నారు. ఇది వారి దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Pawan Kalyan: ప్రతిభ చాటిన విద్యార్థికి పవన్ కల్యాణ్ రూ.లక్ష ప్రోత్సాహకం
MLC Kavitha: అంతేకాకుండా, భద్రాచలం రాముల వారి ఆలయానికి సంబంధించిన మన్యం భూములు పురుషోత్తపట్నం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్నాయని కవిత వివరించారు. రామాలయం తెలంగాణలో ఉంటే, దానికి చెందిన మన్యం భూములు ఏపీలో ఉండటం వల్ల ఆ భూముల్లో అక్రమ కబ్జాలు జరుగుతున్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల, ఈ కబ్జాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రాచలం రామాలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిపై కబ్జాదారులు దాడి చేయడం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని కవిత లేఖలో పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామిగా ఉన్నప్పటికీ, రాముడి పేరు చెప్పి భద్రాచలం ఆలయాన్ని పోలవరంలో ముంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి, భద్రాచలం రాములవారి భూములను కాపాడటానికి ఈ ఐదు గ్రామాలను వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని కవిత చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు.