Kalvakuntla Kavitha: తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న బీఆర్ఎస్ అంతర్గత తగాదాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ నుంచి సస్పెండ్ కావడం ఊహించిందే అయినా, ఆ తర్వాత ఆమె తీసుకోబోతున్న రాజకీయ నిర్ణయాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. ఇప్పటికే పార్టీ కీలక నేతలపై నేరుగా విమర్శలు చేసిన కవిత, నేడు మధ్యాహ్నం 12 గంటలకు జరపబోతున్న మీడియా సమావేశంలో బాంబులు పేల్చనున్నారని టాక్. బీఆర్ఎస్ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
‘జాగృతి’ నుంచి పార్టీ.. టీఆర్ఎస్ సెంటిమెంట్ రీ-క్యాచ్ ప్లాన్
కవితను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమె ఇప్పుడు కొత్త పార్టీ ఆవిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న ‘తెలంగాణ జాగృతి’ సంస్థను రాజకీయ పార్టీగా మార్చాలని కవిత నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ కొత్త పార్టీకి టీఆర్ఎస్ సెంటిమెంట్ కలిసేలా పేరు పెట్టాలనే యోచనలో ఉన్నారని, ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ అనే పేరు ఫైనల్ చేశారన్న ప్రచారం సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. బీసీ ఎజెండాను ప్రధాన ముద్రగా ఉంచుకుని, కవిత కొత్త పార్టీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుంచి బయటకు.. వ్యూహాత్మక కదలికలు
కవిత సస్పెన్షన్‌తో పాటు పార్టీతో అన్ని బంధాలను తెంచుకునేలా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. నేడు జరగబోయే మీడియా సమావేశంలో కవిత పార్టీ వ్యవహారాలపై పలు సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ. హరీశ్‌రావు, సంతోష్‌లపై అవినీతి ఆరోపణలు చేసిన కవిత, ఇప్పుడు మరికొంతమందిపై సైతం కఠిన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇది కూడా చదవండి: Nara lokesh: దేశంలోనే తొలిసారిగా 5 స్మార్ట్ కిచెన్ ప్రారంభం
లేఖ లీక్ నుంచి ధిక్కార ధోరణి
గత మేలో కవిత తన తండ్రికి రాసిన లేఖ బయటకు రావడం, అందులో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కవిత బీఆర్ఎస్‌కు దూరమవుతూ, జాగృతి వేదిక ద్వారా ప్రజల్లోకి వెళ్లడం గమనార్హం. సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ భాగస్వామ్యం వంటి చర్యలతో తన స్వతంత్ర శక్తి కేంద్రాన్ని కవిత బలోపేతం చేశారు.
నోటీసుల్లేని సస్పెన్షన్‌పై విమర్శలు
బీఆర్ఎస్‌లో కవితకు నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం కూడా పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో ఆలె నరేంద్ర, ఈటల రాజేందర్, విజయశాంతి వంటి నేతలను కూడా ఇదే తరహాలో తప్పించిన పార్టీ, ఈసారి కవిత విషయంలో కూడా అదే విధానం అనుసరించింది. ఈ నిర్ణయంపై జాగృతి కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్ రీ-బ్రాండింగ్ ప్రయత్నం
కవిత కొత్త పార్టీ పేరులో టీఆర్ఎస్ అక్షరాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ పార్టీ రాష్ట్రంలో సెంటిమెంట్ సృష్టించినప్పటికీ, భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ప్రజలతో దూరం పెరిగిందన్న అభిప్రాయం ఉంది. ఈ సెంటిమెంట్‌ను తిరిగి క్యాష్ చేసుకోవాలనే వ్యూహంలో కవిత ఉన్నారని రాజకీయ విశ్లేషకుల అంచనా.
కవిత నేటి మీడియా మీట్‌లో ఏం చెప్పబోతున్నారు?
ఇప్పటికే బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలను బహిర్గతం చేస్తానని సంకేతాలు ఇచ్చిన కవిత, నేటి మీడియా సమావేశంలో పార్టీపై తన ధిక్కార ధోరణిని మరింత బలపరచబోతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామాతో పాటు, బీఆర్ఎస్ పై బహిరంగంగా బాణాలు సంధించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

