Kalvakuntla Kavitha: కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచే ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు బయటకు రావడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆల్మట్టి ఎత్తు పెంపుతో తెలంగాణకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని హెచ్చరించిన ఆమె, “దక్షిణ తెలంగాణలోని ఐదు జిల్లాలకు కృష్ణానది జీవనాడి. ఆ నీరు లేకపోతే రైతుల పొలాలు కరువుతో ఎండిపోతాయి. పాలమూరు జిల్లాకు ఒక్క చుక్క నీరు కూడా రానివ్వరు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకే ఇంత నష్టం జరుగుతుంది” అని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలో ఆల్మట్టి ఎత్తు పెరగకుండా ఆపేందుకు ప్రత్యేక జీవో జారీ చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో ఎత్తు పెంపు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా ఉద్దేశిస్తూ ఆమె, “ఇది సాధారణ విషయం కాదు. వెంటనే జోక్యం చేసుకోవాలి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సోనియా గాంధీ ఫోన్ చేయించేలా చూడండి. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడాలి. మీరు ఆగకపోతే పాలమూరు పులిబిడ్డనా లేక పేపర్ పులినా అన్నది ప్రజలు తీర్పు చెబుతారు” అని సెటైర్లు వేశారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: నేడు బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ కీలక భేటీ
అలాగే రాబోయే కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్‌లో సీఎం స్వయంగా హాజరై ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని కోరారు. ఇదే సమయంలో మీడియా తనను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తూ, “హరీష్ రావు మీడియా, సంతోష్ రావు మీడియా, బీఆర్‌ఎస్ మీడియా – అందరూ నన్నే విమర్శిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
తన రాజీనామా గురించి మాట్లాడుతూ, ఇప్పటికే స్పీకర్ ఫార్మాట్‌లో సమర్పించానని, ఫోన్ చేసి ఆమోదించమని కూడా కోరానని తెలిపారు. రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తామని, ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉందని అన్నారు.
ఇక బతుకమ్మ వేడుకలపై మాట్లాడుతూ, ఈసారి అనేక ఆహ్వానాలు వచ్చినట్లు, మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో స్వగ్రామం చింతమండకలో పాల్గొంటానని ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.