MLC Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల అంశం, బనకచర్ల ప్రాజెక్టు, తనపై వచ్చిన వ్యాఖ్యలపై పార్టీ స్పందించిన తీరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు “మెల్లగా తన దారికి రావాల్సిందే” అని ఘాటుగా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ సరైనదేనని కవిత స్పష్టం చేశారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తాను ఈ నిర్ణయాన్ని సమర్థించినట్లు చెప్పారు. అయితే, బీఆర్ఎస్ నేతలు ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడం తప్పు అని, ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసిందని కవిత పరోక్షంగా విమర్శించారు. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్ చేసింది కూడా తానేనని ఆమె గుర్తుచేశారు.
బనకచర్ల ప్రాజెక్టుపై జాగృతి పోరాటం:
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కుట్రపూరిత ప్రాజెక్టు అని, కాంట్రాక్టర్ల కోసమే చేపడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్.. గోదావరి జలాలను అప్పజెప్పి వచ్చారని, టెలీమెట్రీల ఏర్పాటును తమ విజయంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. బనకచర్లను తక్షణమే ఆపాలని, లేదంటే తెలంగాణ జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని కవిత హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లు, బనకచర్ల ప్రాజెక్టుపై అఖిలపక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read: KTR: పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం పట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ఆమెకు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య దూరం పెరుగుతోందనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
కేటీఆర్ ఇటీవల తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఇన్‌చార్జ్‌గా కవిత ప్లేసులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించడం పార్టీలో, సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం కవితకు పార్టీలో, అనుబంధ సంఘాల్లోనూ ప్రాధాన్యం తగ్గుతోందనే ప్రచారానికి కారణమైంది. తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు అన్నపై ఉన్న కోపంతోనే చేశారనే చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. మొత్తానికి, కవిత తాజా వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పరిస్థితులను, నాయకుల మధ్య విభేదాలను మరోసారి స్పష్టం చేశాయి.