Mlc kavitha: బీసీ కులగణన అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కలపై జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి “మోదీ బీసీనా? కాదా?” అనే కొత్త చర్చకు తెరలేపారని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ “రాహుల్ గాంధీ ఏ మతానికి చెందారు?” అనే చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారని ఆమె ధ్వజమెత్తారు.
బీసీ జనాభా లెక్కలే అసలు చర్చగా ఉండాలి
“మోదీ బీసీ అయితే మాకేంది? ఓసీ అయితే మాకేంది?” అని ప్రశ్నించిన కవిత, బీసీల జనాభాను సరిగ్గా లెక్కించడమే అసలు డిమాండ్ అని స్పష్టం చేశారు. తప్పుడు లెక్కలతో బీసీలకు అన్యాయం చేయకూడదని, ప్రభుత్వం అసెంబ్లీలో పక్కా లెక్కలతో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆ బిల్లును కేంద్రంలో బీజేపీ ఆమోదించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
బీసీ బిడ్డలను మోసం చేయొద్దు
బీసీలకు న్యాయం చేసే విషయాన్ని వదిలేసి, మోదీ కులం గురించి, రాహుల్ మతం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. “బీసీ బిడ్డలను మోసం చేయొద్దు” అని హెచ్చరించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రజల మనసులో ఉన్న నాయకుడు
కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో ప్రజలకు నరకయాతన చూపిస్తోందని కవిత విమర్శించారు. ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని, రాష్ట్రంలో ఆయనను తలచుకోని గుండె లేదని అన్నారు. “ప్రజల హక్కుల కోసం కేసీఆర్ పోరాటం చేశారని, అందుకే ప్రజలు ఆయనను ఆదరిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. తన శక్తి, యుక్తులతో కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళతారని కవిత భవిష్యత్‌పై ధీమా వ్యక్తంచేశారు.