MLA Rajasingh: ఇటీవల బీజేపీకి దూరమైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి నుంచి ఆయన బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తన అసమ్మతిని వ్యక్తంచేస్తూ వస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక విషయంలో ఆ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని కూడా తప్పుబట్టారు. దీంతో ఆయన పార్టీ, నాయకుల వైఖరితో అసంతృప్తితో వెంటనే రాజీనామా చేశారు. దానిని ఆ పార్టీ అధిష్టానం కూడా ఆమోదించింది.
MLA Rajasingh: ఆ నాటి నుంచి ఇప్పటివరకూ రాజాసింగ్ ఏపార్టీ వైపు మొగ్గుచూపలేదు. తాను హిందూ ధర్మ పరిరక్షణకే తన జీవితాంతం పనిచేస్తానని చెప్పుకున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ అగ్ర నేతలు తనను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారన్న వ్యాఖ్యలతో రాజాసింగ్ స్పందించారు. స్థానిక బీజేపీ నాయకుల వైఖరిపై ఇటు రాష్ట్ర నాయకత్వానికి, అటు కేంద్ర నాయకత్వానికి చెప్పే ప్రయత్నం చేయగా, విశ్వేశ్వర్‌రెడ్డిని అటూ ఇటూ తిప్పారని ఆరోపణలు వచ్చాయి.
MLA Rajasingh: దీంతో ఆయన తనను ఫుట్‌బాల్ ఆడుకున్నారని, ఓ ఫుట్‌బాల్ సింబల్‌తో కూడిన వ్యాఖ్యలు చేస్తూ ఓ జాతీయ నేతకు చురకలు అంటించారు. ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీలో ఏం జరుగుతుందోనని అటు జాతీయ నాయకత్వం కూడా దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఈ దశలో రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యానించడం గమనార్హం.
MLA Rajasingh: 11 ఏళ్లుగా బీజేపీ బడా నాయకులు తనను కూడా ఫుట్‌బాల్ ఆడుకున్నారని రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. రానున్న రోజుల్లో కూడా చాలా మంది బీజేపీ నాయకులు.. ముఖ్య నేతలకు ఫుట్‌బాల్ బహుమతులను ఇస్తారని చెప్పుకొచ్చారు. సీనియర్ నాయకులకు టికెట్లు ఇవ్వకుండా, అడ్డమైన వారిని పార్టీలోకి ఎందుకు తీసుకుంటున్నారని తాను ప్రశ్నించినట్టు చెప్పారు. తెలంగాణలో ఇప్పటికైనా బీజేపీని కాపాడాలని జాతీయ స్థాయి నాయకులను వేడుకుంటున్నట్టు రాజాసింగ్ కోరారు.