Raja Singh: ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా, హిందూ దేవతలపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్ల కోసం హిందూ దేవుళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన విమర్శించారు.
రాజాసింగ్ మాట్లాడుతూ, దర్శకుడు రాజమౌళికి దేవుడిపై నమ్మకం లేకపోయినా, పదే పదే దేవుళ్లపై సినిమాలు తీస్తూ, ఆ సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ రాజమౌళి నిజంగా నాస్తికుడు అయితే, ఆ విషయాన్ని అందరికీ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా రాజమౌళి హిందూ దేవుళ్లపై ఇలాగే మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.
దీంతో ఆగ్రహం చెందిన రాజాసింగ్, హిందువులెవరూ రాజమౌళి సినిమాలు చూడొద్దని పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తామని ఆయన గట్టిగా హెచ్చరించారు. నాస్తిక డైరెక్టర్లు తీసే సినిమాలను ప్రజలు బహిష్కరించాలని, చూడకుండా ఆపేయాలని రాజాసింగ్ ప్రజలను కోరారు. ఈ విషయంలో రాజమౌళి వివరణ ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

