Balakrishna

Balakrishna: హిందూపురంలో బాలయ్య సందడి.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Balakrishna: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు కొత్త అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం నుంచే ఆయన పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి, పలు కీలక ప్రాజెక్టులకు భూమి పూజలు నిర్వహించారు.

ముందుగా లేపాక్షి మండలం మనేంపల్లి గ్రామంలో బాలకృష్ణ పర్యటించారు. అక్కడ సుమారు రూ. 2.60 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలయ్య తనదైన శైలిలో ప్రొక్లెయిన్‌ ఆపరేట్ చేసి పనులను ప్రారంభించడంతో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అనంతరం అదే మండలంలోని పులమతి చెరువు వద్ద బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు, హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపిన నేపథ్యంలో ఆయన చెరువుకు జల హారతి ఇచ్చారు. ఎండిపోయిన చెరువులు నీటితో కళకళలాడుతుండటం పట్ల స్థానిక ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనతో హిందూపురంలో రాజకీయ సందడి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *