Mk Stalin::తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర ప్రజలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలు చేసిన కుటుంబ నియంత్రణ చర్యలు ఇప్పుడు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనివల్ల భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు తమిళనాడు 8 లోక్‌సభ స్థానాలను కోల్పోయే అవకాశముందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికి ప్రజలు ఆలస్యం చేయకుండా పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో కూడా స్టాలిన్ ఇలాంటి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈసారి, 16 రకాల సంపదకు బదులుగా ప్రతి కుటుంబం 16 మంది పిల్లలను కనాల్సిన అవసరం వచ్చిందని వ్యాఖ్యానించారు.
కుటుంబ నియంత్రణ ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు పరిమితంగా పిల్లలను కనడం ద్వారా సంపదతో జీవించాలని భావించామని ఆయన అన్నారు. అయితే, దీని ప్రభావంగా రానున్న కాలంలో తమిళనాడు లోక్‌సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడిందని, అందువల్ల ప్రజలు మరింత మంది పిల్లలను కనాలని సూచించారు.