Mk Stalin: బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ మద్దతు తెలిపారు. ఈసీని బీజేపీ రిగ్గింగ్ యంత్రంగా మార్చిందని మండిపడ్డ ఆయన, పోలింగ్‌కు సంబంధించిన అక్రమాలపై పోరాటంలో డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా అపహాస్యానికి గురి చేస్తుంటే చూసి ఊరుకోలేమని హెచ్చరించారు. రాహుల్ చేసిన ఆరోపణలపై తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, ప్రతి పౌరుడి ఓటు హక్కు కోసం ప్రతిపక్షాలు నిరసన తెలుపుతున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నియోజకవర్గంలో సర్వే చేయగా, దాదాపు లక్ష నకిలీ ఓట్లు బయటపడ్డాయని గుర్తుచేశారు. ఈ విషయాన్ని దేశం ముందు ఉంచినా, ఈసీ మాత్రం మౌనం వహించిందని విమర్శించారు.
ఇక, ఢిల్లీలో ఈరోజు జరిగిన ‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. అఖిలేశ్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు బ్యారికేడ్లు ఎక్కి నిరసన తెలిపారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

