బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఆక్టోబర్ 8న జరిగే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. “మిథున్ అద్భుతమైన సినిమా ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే ఎంపిక జ్యూరీ ఈ దిగ్గజ నటుడిని ఎంపిక చేసిందని ప్రకటించడం గౌరవంగా ఉంది” అని మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం తనని వరించడంపై మిథున్ చక్రవర్తి ఆనందం వ్యక్తం చేశారు ‘‘మాటలు రావడం లేదు. ఇలాంటి గొప్ప విజయాన్ని నేను అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉన్నా. నా కుటుంబానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు దీనిని అంకితం చేస్తున్నా’’ అని తెలిపారు.
1950లో కోల్‌కతాలో జన్మించిన మిథున్.. 1976లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1989లో ఏకంగా 19 సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించారు. నటుడు మిథున్ చక్రవర్తి, దర్శకుడు మృణాల్ సేన్ నిర్మించిన ‘మృగయా’(1976) సినిమాతో బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేశాడు. ఆ సినిమాలో అతడు తన పాత్రను అద్బుతంగా నిర్వహించినందుకు జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. 1982లో వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్’ సినిమాతో మిథున్ చక్రవర్తి అందరికీ బాగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ అయింది. ఆ తర్వాత 1990లో వచ్చిన ‘అగ్నిపథ్’ సినిమా కూడా బాగా ప్రేక్షకాదరణ పొందింది. అతడు ‘కసమ్ పైదా కర్నే వాలేకి’, ‘కమాండో’ వంటి సినిమాలో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.