Selin Kocalar: జీవితంలో గొప్పగా ఎదగాలి, కోట్లు సంపాదించాలి అన్నది ప్రతి ఒక్కరి కల. దానికోసం రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. అయితే, కేవలం కష్టపడటమే విజయాన్ని తెచ్చిపెట్టదని, సరైన దిశలో ప్రయాణించడమే అసలైన గెలుపు అని నిరూపిస్తున్నారు సెలిన్ కొకలర్. ప్రపంచ ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుండి మధ్యలోనే చదువు మానేసి (డ్రాపౌట్), కేవలం రెండేళ్లలో 2500 కోట్ల రూపాయల ($300 మిలియన్లు) విలువైన ‘డెల్వ్’ (Delve) సంస్థను నిర్మించి పారిశ్రామిక ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
హార్డ్ వర్క్ మాత్రమే గ్యారెంటీ ఇవ్వదు
విజయంపై సెలిన్ కొకలర్ చెప్పిన ‘నిచ్చెన ఉదాహరణ’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అభిప్రాయం ప్రకారం.. “జీవితం అనేది వందల సంఖ్యలో చెట్లు ఉన్న ఒక పెద్ద తోట లాంటిది. మీరు ఒక చెట్టుకు నిచ్చెన వేసి ఎంతో కష్టపడి పైకి వెళ్లొచ్చు. కానీ పైకి వెళ్లాక చూస్తే.. పక్కనే మీరు ఎక్కిన దానికంటే ఎత్తైన చెట్టు కనిపిస్తే, అప్పటివరకు మీరు పడ్డ కష్టమంతా వృథా అయినట్లే.”
అంటే, మనం ఎంచుకున్న మార్గం లేదా లక్ష్యం సరైనదో కాదో ముందే ఆలోచించాలి. తప్పుడు దిశలో ఎంత వేగంగా వెళ్లినా ఫలితం ఉండదని, కష్టపడటానికి ముందే దిశను (Direction) నిర్ణయించుకోవాలని ఆమె సూచిస్తున్నారు.
టైమ్ ట్రావెలర్‌లా ఆలోచించండి
ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుతున్నప్పుడు మన ఆలోచనా సరళి ఎలా ఉండాలో సెలిన్ వివరించారు. మనల్ని మనం ఒక ‘టైమ్ ట్రావెలర్’లా ఊహించుకోవాలని ఆమె అంటారు. “మీరు ఒక 50 ఏళ్ల భవిష్యత్తులోకి వెళ్లి, అక్కడ ఒక గొప్ప విజేతగా నిలిచారని ఊహించుకోండి.
ఇది కూడా చదవండి: Jammu: భారత్ లోకి 30 మంది టెర్రరిస్టుల చొరబాటు..!?
ఇప్పుడు అక్కడి నుండి వెనక్కి తిరిగి చూస్తే.. ప్రస్తుత కాలంలో మీరు ఏం చేస్తే బాగుంటుందనిపిస్తుందో ఆలోచించండి. స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తి కావాలని కోరుకుంటే, ఇప్పుడే మీ దైనందిన జీవితాన్ని ఆ స్థాయిలో మలుచుకోవాలి.” ఈ ఆలోచన లక్ష్యాలపై తిరుగులేని స్పష్టతను ఇస్తుంది.
ప్రవాహానికి ఎదురీదండి
అందరూ చేసే పనినే మనం చేస్తే ప్రత్యేకత ఉండదని సెలిన్ నమ్ముతారు. ప్రపంచం వెళ్తున్న దారికి భిన్నంగా వెళ్లడం వల్లే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఆమె అంటారు. దీనికి ఉదాహరణగా, అందరూ స్పానిష్ నేర్చుకుంటున్నప్పుడు ఆమె సవాలుగా తీసుకుని చైనీస్ భాషను ఎంచుకున్నారు. ఏదైనా శూన్యం నుండి నేర్చుకోవడం వల్ల మనలోని అసలైన సామర్థ్యం బయటపడుతుందని ఆమె భరోసా ఇచ్చారు.
ఎవరీ సెలిన్ కొకలర్? ‘డెల్వ్’ ఏం చేస్తుంది?
సెలిన్ కొకలర్ తన స్నేహితుడు కిరణ్ కౌశిక్‌తో కలిసి ‘డెల్వ్’ (Delve) సంస్థను స్థాపించారు. ప్రస్తుతం ఆమె ఈ సంస్థకు కో-ఫౌండర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లను ఉపయోగించి పెద్ద కంపెనీలకు సంబంధించిన ‘రెగ్యులేటరీ కాంప్లయెన్స్’ (నిబంధనల అమలు) ప్రక్రియను సులభతరం చేస్తుంది. వందల గంటల మానవ శ్రమను తగ్గించే ఈ టెక్నాలజీతో ఇన్వెస్టర్ల మనసు గెలుచుకుని, అతి తక్కువ కాలంలోనే తన కంపెనీని బిలియన్ డాలర్ల క్లబ్ వైపు నడిపిస్తున్నారు.

