Nandan Kanan Express: ఒడిశాలోని భద్రక్ జిల్లాలో నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్‌లో కదులుతున్న రైలుపై మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటన చరంప స్టేషన్ సమీపంలో జరగడంతో రైలులో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్), జిఆర్‌పి వెంటనే చర్యలు తీసుకుని దర్యాప్తు ప్రారంభించాయి.
గార్డు వ్యాన్ కిటికీపై ఈ దాడి జరిగినట్లు రైలు గార్డు చెప్పారని రైల్వే శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. నందన్ కానన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ భద్రక్ స్టేషన్ నుండి ఉదయం 9:25 గంటలకు బయలుదేరింది. ఐదు నిమిషాల తరువాత, ఉదయం 9:30 గంటలకు కాల్పుల సంఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ప్రయాణికులెవరూ గాయపడలేదు కానీ, కోచ్ అద్దాలు పగిలిపోయాయి. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నందన్ కనన్ ఎక్స్‌ప్రెస్‌ను సురక్షితంగా పూరీకి తరలించింది. అయితే కాల్పులకు గల కారణాలు, దాడికి పాల్పడిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ విషయంపై జీఆర్‌పీ విచారణ ప్రారంభించి, ప్రయాణికుల భద్రత కోసం ప్రత్యేక నిఘా పెట్టాలని రైల్వే అధికారులు ఆదేశించారు.