Elon Musk: ప్రపంచ కుబేరుడు, టెస్లా (Tesla) సీఈవో, స్పేస్‌ఎక్స్ (SpaceX) వ్యవస్థాపకుడు అయిన ఎలాన్ మస్క్ (Elon Musk) వ్యక్తిగత సంపద విషయంలో సరికొత్త మైలురాయిని అధిగమించి చరిత్ర సృష్టించారు. మస్క్ నికర సంపద ఏకంగా 600 బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ స్థాయి సంపదను ఆర్జించిన వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు.
ఒక్క రోజులో భారీ వృద్ధి
ప్రస్తుతం మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ విలువ దాదాపు 800 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు, త్వరలోనే అది ఐపీఓ (IPO) ద్వారా పబ్లిక్‌లోకి వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలోనే ఆయన సంపద అమాంతం పెరిగింది. స్పేస్‌ఎక్స్‌లో మస్క్‌కు దాదాపు 42% వాటా ఉంది.
నివేదికల ప్రకారం, ఒక్క రోజులోనే మస్క్ సంపద ఏకంగా 168 బిలియన్ డాలర్లు పెరిగి, సోమవారం మధ్యాహ్నం సమయానికి ఆయన నికర సంపద సుమారు 677 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Upasana Konidela: మెగా ఇంట మరో గుడ్ న్యూస్?
ఈ ఏడాది అక్టోబరులోనే మస్క్ నికర సంపద 500 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. 2022లో 200 బిలియన్ డాలర్ల కంటే దిగువకు పడిపోయిన ఆయన సంపద, ఈ మూడేళ్ల స్వల్ప కాలంలోనే 600 బిలియన్ డాలర్లను అధిగమించడం విశేషం. ఇప్పటివరకు ఏ ప్రపంచ కుబేరుడు కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేదు.
పే ప్యాకేజీ ట్రిలియన్ డాలర్లు!
సంపద విషయంలో రికార్డులు సృష్టిస్తున్న మస్క్, జీతం విషయంలోనూ కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక పే ప్యాకేజీని అందుకుంటున్న సీఈఓగా నిలిచారు.
టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన టెస్లా వార్షిక సర్వసభ్య సమావేశంలో, షేర్‌హోల్డర్లు మస్క్‌కు జీతం కింద (పే ప్యాకేజీ) ట్రిలియన్ డాలర్లు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఇది కార్పొరేట్ చరిత్రలో ఒక కొత్త రికార్డు.
ట్రిలియనీర్ కావడం ఖాయమేనా?
అయితే, మస్క్‌కు ఈ ట్రిలియన్ డాలర్ల పే ప్యాకేజీ పూర్తిగా అందాలంటే కొన్ని కఠినమైన లక్ష్యాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం 1.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న టెస్లా మార్కెట్ విలువను మస్క్ ఏకంగా 8.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాల్సి ఉంటుంది.
స్వీయ డ్రైవింగ్ సామర్థ్యం ఉన్న లక్షల సంఖ్యలో రోబోట్యాక్సీ వాహనాలను వాణిజ్య కార్యకలాపాల్లోకి తీసుకురావాలి.
ఈ లక్ష్యాలను మస్క్ విజయవంతంగా చేరుకుంటే, ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ (Trillionaire) అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
