Minor Girls Missing: జగిత్యాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక మిస్సింగ్ కలకలం రేపింది. 24 గంటలు అయినా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని విజ్‌డమ్ హైస్కూల్ హాస్టల్లోనే ఇబ్రహీం పట్నంకు చెందిన బాలిక పదవ తరగతి చదువుకుంటుంది. నిన్న మధ్యాహ్నం భోజన సమయంలో స్నేహితులని కలిసి వస్తానని తోటి విద్యార్థినులకు చెప్పి వెళ్లింది. అర్ధరాత్రి అయినా మళ్లీ హాస్టల్‌కు తిరిగి రాలేదు. దీంతో స్కూల్ యాజమాన్యం బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పాఠశాల వద్దకు చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు మెట్‌పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: Supreme Court: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట
బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. బాలిక అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పదవ తరగతిలో ఎక్కువ ఉత్తీర్ణత సాధించాలని స్కూల్ యాజమాన్యం పిల్లలని చదవాలని ఒత్తిళ్ళకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్కూల్‌యజమని రామారావును బాలిక కుటుంబ సభ్యులు నిలదీశారు. పిల్లల పట్ల నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చొరవ తీసుకుని బాలికను అప్పగించాలని వేడుకున్నారు. నిన్న అదృశ్యమైన బాలిక 24 గంటలు అయినా ఆచూకీ దొరకక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం సీఐ నిరంజన్ రెడ్డి గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల సీసీ కెమెరాల పర్యవేక్షించారు. హాస్టల్ భవనంతో పాటు గదులను పరిశీలించారు.