Seethakka: తెలంగాణ శాసనసభలో మంత్రి సీతక్క ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడమే ఆ పార్టీ పనిగా పెట్టుకుందని ఆమె మండిపడ్డారు. గత పదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం మహిళల పట్ల వ్యవహరించిన తీరును ఎండగట్టారు.
మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు. మహిళా సంఘాల రుణాలకు సంబంధించి గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను తాము తీరుస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు రూ.1,390 కోట్ల వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించిందని వెల్లడించారు. గత ప్రభుత్వం మహిళలపై రూ.3 వేల కోట్ల వడ్డీ భారాన్ని మోపిందని, ఆడబిడ్డలు కష్టపడి దాచుకున్న పైసలను కూడా వదలకుండా కాజేసిందని ఆమె ఆరోపించారు.
గత ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను సీతక్క ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదేళ్ల కాలంలో ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని, అలాగే పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. సొంతంగా ఇళ్లు నిర్మించలేని వారు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తుందని, వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని సీతక్క భరోసా ఇచ్చారు. విమర్శలు చేసే ముందు గతంలో తాము చేసిన తప్పులను ఒక్కసారి సమీక్షించుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులకు సూచించారు. అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టలేరని ఆమె స్పష్టం చేశారు.
