minister satya kumar: ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఇతర రంగాల మాదిరిగానే ఆరోగ్య వ్యవస్థను కూడా వైసీపీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రజలు ఈ అంశాన్ని గమనించి ఎన్నికల్లో తగిన తీర్పు ఇచ్చారని అన్నారు.
గత ప్రభుత్వం వారసత్వంగా రూ.6,500 కోట్ల అప్పును వదిలి వెళ్లిందని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకంలో రూ.2,500 కోట్లు, మందుల సరఫరా సంస్థలకు రూ.1,000 కోట్లు, వైద్య కళాశాలల నిర్మాణాలకు రూ.700 కోట్లు, నాడు-నేడు కార్యక్రమంలో రూ.400 కోట్ల బకాయిలు మిగిలిపోయినట్టు పేర్కొన్నారు.
అయితే, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తాము ఆరోగ్య రంగాన్ని గాడిలో పెట్టామని తెలిపారు. మౌలిక సదుపాయాల పెంపుతో పాటు, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టామని చెప్పారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 30 పైగా పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య శాఖ పనితీరును మెచ్చి రూ.100 కోట్ల ప్రోత్సాహక నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి కొనసాగిస్తుందన్నారు.
