Hyderabad: తెలంగాణలో కొత్తగా వచ్చిన ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల కోసం మరో మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అదే ఇందిరమ్మ క్యాంటీన్లు. ఈ క్యాంటీన్లను హైదరాబాద్ నగరంలో పనికోసం, ఇతర పనుల కోసం వచ్చే సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం తక్కువ ధరకే అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నగరంలోని బాగ్ లింగంపల్లి, సుందరయ్య పార్క్ దగ్గర మొదటి ఇందిరమ్మ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మరియు కవాడిగూడ NTPC దగ్గర కూడా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇంకా హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరమో, అక్కడి ప్రజలు లేదా స్థానిక నాయకులు కోరిన చోట కూడా వీటిని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
₹5 రూపాయలకే ప్రజలకు మంచి నాణ్యమైన టిఫిన్, భోజనం ఈ ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా అందుబాటులోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ వంటి పెద్ద నగరానికి ఉపాధి కోసం వచ్చిన పేద, మధ్య తరగతి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు ఇతర ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

