Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy: పాలనలో వేగం పెంచండి.. కొత్త కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష

Ponguleti Srinivas Reddy: ప్రభుత్వ లక్ష్యాలను నెరవేరుస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పలు జిల్లాల కలెక్టర్లు మంగళవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంత్రి వారికి దిశానిర్దేశం చేశారు.

మంత్రిని కలిసిన వారిలో జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఒక ఐఏఎస్ అధికారి కెరీర్‌లో జిల్లా కలెక్టర్ బాధ్యత అనేది చాలా కీలకమని, ఈ సమయంలోనే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని మంత్రి వారికి వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేస్తేనే భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి గుర్తు చేశారు. ప్రభుత్వ పధకాలు అర్హులైన ప్రతి పేదవాడికి అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అనే రెండు అంశాలను సమతుల్యం చేస్తూ జిల్లాలను ప్రగతి పథంలో నడిపించాలని సూచించారు.

పాలనలో ఎప్పుడూ ‘ప్రజలే కేంద్రంగా’ నిర్ణయాలు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై పట్టు సాధించాలని చెప్పారు. జిల్లా యంత్రాంగం అంతా ఒక జట్టుగా కలిసి పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవాలని, సామాన్యుడికి మేలు జరిగేలా మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కొత్త కలెక్టర్లకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *