Minister Payyavula: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిన్న (బుధవారం) సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా చోటుచేసుకున్న పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన “యాట తలలు నరికినట్లు నరుకుతాం” అంటూ రెచ్చగొట్టే ప్లకార్డులను మంత్రి తీవ్రంగా ఖండించారు.
ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మంత్రి పయ్యావుల, అరాచక వాదులను వెంటబెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారని జగన్ మోహన్ పై మండిపడ్డారు. “రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తామంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు” అని ఆరోపించారు. గత ఐదేళ్ల అరాచక పాలనను ప్రజలు “రప్పా రప్పా నరికేశారు” అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఓడించినా జగన్ మోహన్ తీరు మారలేదని, ఇంకా భయపెట్టాలనే చూస్తున్నారని అన్నారు.
“రప్పా రప్పా నరుకుతాం అనే ఫ్లెక్సీని ఖండించాల్సింది పోయి, సంతోషం అంటున్నారంటే హింసను ప్రేరేపించడం కాదా? ప్రజాస్వామ్యాన్ని రప్పా రప్పా నరుకుతారా?” అంటూ మంత్రి పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ తీరుపై పయ్యావుల ప్రశ్నల వర్షం:
“గంజాయి బ్యాచ్‌ని, రౌడీలను జగన్ మోహన్ పరామర్శిస్తారా? నీ పర్యటనలో ఇద్దరు చనిపోతే కనీసం పరామర్శించరా? భయపెట్టి రాజ్యం చెలాయించాలన్నట్లుగా జగన్ మోహన్ తీరు ఉంది” అని మంత్రి దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను భయపెట్టారని, ఇప్పుడు అధికారం పోయే సరికి రౌడీలను సమాయత్తం చేస్తున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.
Also Read: Kommineni Character: లైవ్‌షోలో కన్నీరు… కర్మ ఫలితమేనా?
Minister Payyavula: “వివేకా కుటుంబాన్ని జగన్ మోహన్ ఎందుకు పరామర్శించలేదు? పరామర్శకు వెళ్లి కులాల ప్రస్తావన ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు కుల రాజకీయం చేశారు, ఇప్పుడు కూడా కుల రాజకీయమేనా?” అని ప్రశ్నించారు. కొడాలి నాని, వంశీ లాంటి వాళ్లు అమాయకులా అని ప్రశ్నిస్తూ, రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ద్వారా అరాచకాలు సృష్టిస్తారా అని నిలదీశారు.
ప్రభుత్వం ‘తల్లికి వందనం’, ఉచిత గ్యాస్ లాంటి పథకాలు అమలు చేస్తుంటే, లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తుంటే కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. “ఇలాంటి కడుపు మంటకు మందు కూడా లేదు. ఇలాగే వ్యవహరిస్తే 11 సీట్లు కూడా రావు” అని పయ్యావుల హెచ్చరించారు.
ఓటమి నుంచి వైసీపీ నేతలు పాఠం నేర్చుకోలేదని, ప్రభుత్వంపై కాదు.. ప్రజలపైనే వైసీపీ తిరుగుబాటు చేస్తోందని పయ్యావుల వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ పాలనలో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలపై కేసులు పెట్టారని గుర్తు చేస్తూ, తప్పు చేస్తే మాత్రం ఎవరికైనా శిక్ష తప్పదని, అరాచకాలు సృష్టించే ప్రయత్నం చేస్తే చట్టం తనపని తాను చేస్తుందని స్పష్టం చేశారు. సొంత చెల్లిపైనే నిఘా పెట్టిన చరిత్ర జగన్ మోహన్ ది అని ఆరోపించిన పయ్యావుల, ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం సిట్ వేసి విచారణ జరుగుతోందని గుర్తు చేశారు.

