Nara Lokesh: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో శుక్రవారం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, మహిళల పాత్ర, సాధికారిత, భద్రతపై గట్టిగా హైలైట్ చేస్తూ మాట్లాడారు .
“ఆవకాయ పెట్టాలన్నా అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళలే ముందుంటారు” అని లోకేష్ వ్యాఖ్యానించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కాలంలోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతిని నియమించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. విద్యలో కూడా ఆడపిల్లలే దూసుకుపోతున్నారని, 85 శాతం ఉత్తమ విద్యార్థులు మహిళలేనని వెల్లడించారు.
3600 కుట్టుమిషన్లు – వ్యాపారంలో మహిళలు ముందంజ
మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెబుతూ, 3,600 మంది మహిళలకు కుట్టుమిషన్లు అందజేశామని గుర్తు చేశారు. హెరిటేజ్ సంస్థను 1992లో చంద్రబాబు ప్రారంభించి, తల్లి భువనేశ్వరికి అప్పగించగా, ఆమె ఇప్పుడు రూ.5 వేల కోట్ల విలువైన కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. భార్య బ్రాహ్మణి కూడా వ్యాపారంలో రాణిస్తున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: Actress Kasturi: బీజేపీలో చేరిన అన్నమయ్య హీరోయిన్
మహిళల భారం తగ్గించే ఫ్రీ బస్సు పథకం
స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా నెలకు కనీసం రూ.1,500 భారం తగ్గుతుందని తెలిపారు. అయితే గత ఐదేళ్లలో మహిళల ఆభరణాలను మద్యం వ్యసనంతో తాకట్టు పెట్టించారని విమర్శించారు. “తల్లి, చెల్లిని పట్టించుకోని వ్యక్తి ఇతర మహిళలకు న్యాయం చేస్తారా?” అని ప్రశ్నించారు.
మహిళల గౌరవం కోసం ప్రత్యేక చట్టం అవసరం
సినిమాలు, వెబ్ సిరీస్‌లలో మహిళలను కించపరిచే అసభ్య వ్యాఖ్యలను తొలగించాలని, భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలను అరికట్టేలా ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఉందని సూచించారు. మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఘనత కూడా ఎన్టీఆర్‌దేనని గుర్తు చేశారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ – మోడీ, చంద్రబాబు, పవన్ కలయిక
కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కలయికతో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని లోకేష్ పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’లో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ కుటుంబానికి భారతదేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.